టీఎస్ఆర్టీసీ మెగా ర‌క్త‌దాన శిబిరాల‌కు అన్యూహ స్పంద‌న‌ | Sakshi
Sakshi News home page

టీఎస్ఆర్టీసీ మెగా ర‌క్త‌దాన శిబిరాల‌కు అన్యూహ స్పంద‌న‌

Published Wed, Jun 28 2023 6:28 PM

Huge Response To Tsrtc Mega Blood Donation Camps - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 'ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)  రాష్ట‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారం  నిర్వ‌హించిన 101 మెగా ర‌క్త‌దాన శిబిరాల‌కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. మంగ‌ళ‌వారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3 వరకు నిర్వ‌హించిన ర‌క్త‌దాన శిబిరాల్లో 3315 మంది స్వ‌చ్ఛందంగా ముందుకువ‌చ్చి ర‌క్త‌దానం చేశారు. రాష్ట్రంలోని 11 రీజియ‌న్లలోని అన్ని డిపోలు, యూనిట్ల‌లోని సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ వారితో పాటు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చిన యువ‌త‌, మ‌హిళ‌ల నుంచి ఒక్కో యూనిట్ 350 ఎంఎల్ చొప్పున మొత్తం 3315 యూనిట్ల ర‌క్తాన్ని సేక‌రించారు.

ప్రయాణికులకు మెరుగైన, నాణ్య‌మైన, సురక్షిత సేవలను అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలల్లోనూ సంస్థ భాగం కావ‌డం త‌మ‌కెంతో సంతోషంగా ఉంద‌ని టీఎస్ఆర్టీసీ చైర్మ‌న్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారితో పాటు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను సంస్థ నిర్వ‌హించింద‌ని గుర్తు చేశారు. టీఎస్‌ఆర్టీసీ పిలుపు మేర‌కు స్వ‌చ్ఛందంగా శిబిరాల‌కు త‌ర‌లివ‌చ్చి ర‌క్త‌దానం చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లను తెలియ‌జేశారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదానం చేసిన వారి సేవను వెలకట్టలేమని కొనియాడారు.

సామాజిక బాధ్య‌త‌గా సంస్థ సిబ్బంది, యువ‌త ముందుకు వ‌చ్చి ర‌క్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం మంచి పరిణామమని, టీఎస్ఆర్టీసీపై ప్ర‌జ‌ల విశ్వాసాన్ని మ‌రింత‌గా పెంచేందుకు ఈ కార్య‌క్ర‌మం ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. “ప్ర‌మాదాల్లో క్ష‌త‌గాత్రుల‌కు ర‌క్తం అత్య‌వసరం. ర‌క్తం అందుబాటులో లేక అనేక మంది ప్రాణాలు కొల్పోతున్నారు. 3315 మంది అందించిన రక్తం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. ఎన్నో కుటుంబాలను నిలబెడుతుంది. రక్తదానం సేవ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి” అని బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్, వీసీ స‌జ్జ‌న‌ర్ సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement