హైదరాబాద్‌లో ‘కేరళ స్టోరీ’ ఉదంతం.. కూతురు జాడ చెప్పాలంటూ.. | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ‘కేరళ స్టోరీ’ ఉదంతం.. కూతురు జాడ చెప్పాలంటూ..

Published Fri, Jul 7 2023 10:37 AM

Kerala story Like case A Mother Anguish Her Missing Daughter Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన కుమార్తె ఆచూకీ తెలుసుకోవాలని లేకపోతే మరో శాలినీ ఉన్నికృష్ణన్‌ అయ్యే అవకాశం ఉందని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు సుమన్‌ జాదవ్, హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకరతో కలిసి మాట్లాడుతూ... తన కూతురు సోనీజాదవ్‌(21) ఎంబీఏ పూర్తిచేసిందన్నారు. భర్త చనిపోవడంతో చిన్న టిఫిన్‌ బండి పెట్టుకుని కూతురు, ఇద్దరు కొడుకులను పోషించుకుంటున్నానని తెలిపారు.

10వ తరగతి వరకు కార్వాన్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో తన కూతురు సోని చదువుకుందని, అప్పుడే అమ్రన్‌ బేగం అనే మరో యవతితో పరిచయం ఏర్పడి ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారన్నారు. గత నెల 7వ తేదీన అమ్రాన్‌ బేగం మా ఇంటికి వచ్చి సోనీని తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిందన్నారు. రాత్రి అయినా రాకపోవడం ఇద్దరికీ ఫోన్‌ చేసినా స్పందన లేదని.. దీంతో లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశామన్నారు. పోలీసులు వెతికి 11వ తేదీన వారిని మెజిస్ట్రేట్‌ ముందుకు తీసుకువచ్చారని తెలిపింది.

అప్పటివరకు నాకు తెలియదన్న అమ్రాన్‌ బేగం తన కూతురు సోనీని, న్యాయవాదులను తీసుకుని వచ్చిందన్నారు. సోనీ పోలీసులకు తాను మేజర్‌ను అని సర్టిఫికెట్లు చూపించి తన ఇష్టం ఉన్నచోట ఉంటానని పోలీసులకు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయిందన్నారు. తాము ఎంతసర్ది చెప్పాలని చూసినా వినిపించుకోకుండా వెళ్లిపోయిందన్నారు. అప్పటి నుంచి తన కూతురు సోనీ ఆచూకీ లేదని చెప్పింది.

తనకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రిలో అడ్మిట్‌ ఉన్నానని చెప్పినా కనీసం స్పందించడం లేదని, అమ్రన్‌ బేగం తనకు తెలియదు తన ఇంటికి రావద్దు అని హెచ్చరిస్తుందన్నారు. సోనీ 21 సంవత్సరాలు వచ్చిన రెండు నెలలకే ఈ పనిచేశారని, రెండు నెలల ముందే పాస్‌పోర్టు కూడా తీయించినట్లు తెలిసిందని ప్రస్తుతం తన కూతురు ఎక్కడ.. ఎలా ఉందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తన కూతురు ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement