సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం

Published Tue, Jun 6 2023 4:33 AM

KTR Says Special Act for Control of Cyber Crimes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సైబర్‌ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ‘నల్సార్‌’న్యాయ విశ్వవిద్యాలయంతో కలిసి దేశంలోనే మొదటిసారిగా సైబర్‌ క్రైమ్‌ చట్టాన్ని తెస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు. తెలంగాణ చేయబోయే సైబర్‌క్రైమ్‌ చట్టంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు.

సోమవారం టీ–హబ్‌ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం 2022–23’వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ఐటీ రంగ వృద్ధికి సంబంధించిన అన్ని సూచీల్లో రాష్ట్రం జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతోందని చెప్పారు. బెంగళూరుకు దీటుగా హైదరాబాద్‌ను నిలబెడతామని రాష్ట్ర అవతరణ సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. 

కేంద్రం నుంచి సాయం అందకున్నా.. 
కరోనా సమయంలోనూ, ఆ తర్వాత కూడా అనేక అనుమానాలు ఎదురైనా, కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరిగినా తెలంగాణ తన సొంత ప్రణాళికలతో ఐటీ రంగంలో అభివృద్ధి సాధిస్తూ వస్తోందని కేటీఆర్‌ చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే 9 ఏళ్లుగా ఐటీ శాఖ వార్షిక నివేదికలను విడుదల చేస్తున్నామని వివరించారు. అమెరికా, యూకే పర్యటనలో తాను సాధించిన పెట్టుబడి ప్రకటనలను, గత ఏడాది కాలంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, కొత్త ఉద్యోగాల కల్పన వివరాలను కేటీఆర్‌ వెల్లడించారు.

రాబోయే రోజుల్లో ఐటీ రంగంలో కొత్త శిఖరాలకు చేరుకుంటామని.. ప్రాథమిక మౌలిక వసతుల నుంచి అంతరిక్షం దాకా తెలంగాణ శరవేగంగా పురోగమిస్తోందని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని, కేసీఆర్‌ మరోమారు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టి పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. 

ఫార్మా, బయోటెక్నాలజీలోనూ అద్భుత ప్రగతి 
ఫార్మా, బయో టెక్నాలజీ, డిజిటల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేటీఆర్‌ చెప్పారు. 2012లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు తెలంగాణలో ఐటీ ఎగుమతులు 2032 నాటికి రూ.2.5లక్షల కోట్లకు చేరుతాయని ప్రకటించిందని.. ఐటీఐఆర్‌ అమలు చేయకున్నా ఆ గడువుకు 9 ఏళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు.

తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ రంగం మెరుగ్గా రాణిస్తోందని వివరించారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ–హబ్‌ సీఈఓ ఎం.శ్రీనివాస్‌రావు, వీ హబ్‌ సీఈఓ దీప్తిరావు, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement