Police Asks Donations From Merchants For CM KCR Asifabad District Tour - Sakshi
Sakshi News home page

Asifabad: మూడు రోజుల్లో సీఎం పర్యటన.. భోజన ఖర్చులివ్వండి! దిక్కుతోచని స్థితిలో వ్యాపారులు

Published Tue, Jun 27 2023 8:23 PM

Police Asks Donations From Merchants For CM KCR Tour - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చిందన్న చందంగా మారింది జిల్లా పోలీసుల తీరు.. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. సీఎం బందో బస్తుకు వస్తున్న దాదాపు 2,500 మంది పోలీసులకు వసతి, భోజన ఏర్పాట్లు చేయడం జిల్లా పోలీసుశాఖకు కత్తిమీద సాములా మారినట్లు సమాచారం. ఇప్పటికే వీరి వసతి కోసం జిల్లా కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలు, ఫంక్షన్‌హాళ్లను తమ ఆధీనంలోకి తీసుకోనున్న పోలీసులకు, వీరందరికి భోజన ఏర్పాట్లు చేయడం తలకు మించిన భారంగా మారింది. వ్యాపారుల నుంచి పోలీసుల భోజన ఖర్చులకు విరాళాలు అడగడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది.  
2,500 మందితో బందోబస్తు..
సీఎం పర్యటనకు బారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నేతృత్వంలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ స్థాయి అధికారులతోపాటు అడిషనల్‌ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఎ స్సైలు, పీసీలు, హోంగార్డులు, స్పెషల్‌ పార్టీ, మ హిళా పోలీసులతో మొత్తం 2,500 మందితో బందోబస్తు ఉండనున్నట్లు తెలిసింది. కాగా వీరంతా ఈ నెల 28న జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. వీరందరికీ వసతి, భోజన ఏర్పాట్లు జిల్లా పోలీ సుశాఖ చేపట్టింది.

ఇందులో వసతి ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో ఊపిరిపీల్చుకున్న పోలీసు అధికారులకు భోజన ఏర్పాట్ల అంటేనే ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో వ్యాపారుల సాయం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కో వర్తక సంఘానికి రూ.లక్ష చొప్పున టార్గెట్‌ విధించడంపైనే వ్యాపారుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదనే నిర్ణయానికి వచ్చే వ్యాపారులపై ఒత్తిడి తెచ్చారనే ప్రచారం సాగుతోంది.

వ్యాపారుల్లో తర్జన భర్జన..
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనం, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమాలతోపాటు కుమురంభీం, కొట్నాక భీంరావు విగ్రహాల ఆవిష్కరణ తదితరాలు కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది జిల్లాకు తరలిరానున్నారు. కార్యక్రమానికి మూడు రోజుల ముందుగానే వీరంతా జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు.

కాబట్టి వీరందరికి వసతి, భోజన ఏర్పాట్ల బాధ్యతలు స్థానిక పోలీసు ఉన్నతాధికారులపై పడింది. దీంతో పోలీసు అధికారులు వ్యాపారులతో మాట్లాడి.. పోలీసుల భోజన ఖర్చులకు డబ్బులు సమకూర్చాలని కోరినట్లు సమాచారం. ఒక్కో వర్తక సంఘం తరఫున రూ.లక్ష ఇవ్వాలని పోలీసు సిబ్బంది కోరడంతో వ్యాపారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయినా ప్రభుత్వ కార్యక్రమానికి విరాళాలు అడగడం ఏంటి? అన్న చర్చ వ్యాపారుల్లో జరుగుతుండటం గమనార్హం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement