ఎట్టకేలకు ఎంట్రీ  | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఎంట్రీ 

Published Fri, Jun 23 2023 1:44 AM

Southwest Monsoon has entered the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. బుధవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌ అంతటా వ్యాప్తి చెందిన రుతుపవనాలు... గురువారం కల్లా తెలంగాణలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిసరాల వరకు వ్యాప్తి చెందిన రుతుపవనాలు.. రెండు, మూడు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

గతేడాది జూన్‌ మొదటివారం కల్లా రాష్ట్రమంతటా విస్తరించిన రుతుపవనాలు... ఈసారి రెండువారాలకు పైబడి ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు కాలాన్ని నైరుతి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ క్రమంలో జూన్‌ మొదటి వారంలో తొలకరి జల్లులతో ప్రారంభమై క్రమంగా మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు నమోదవుతాయి. సీజనల్‌ వర్షాలు వ్యవసాయానికి అత్యంత కీలకం.

కానీ ఈసారి తొలకరి వర్షాలు ఆలస్యం కావడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ రానున్న కాలంలో ఎలాంటి వాతావరణం నెలకొంటుందో వేచి చూడాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలకరి వర్షాలు చూసి విత్తనాలు నాటకుండా కాస్త వేచిచూడడమే మంచిదని సూచిస్తున్నారు. 

మొదలైన వానలు 
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాలపై గురువారం రుతుపవనాలు ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతానికైతే రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఇదే వేగాన్ని కొనసాగిస్తే రానున్న మూడురోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.

జూన్‌ నెలలో రాష్ట్రవ్యాప్తంగా నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 12.93 సెంటీమీటర్లు. కాగా జూన్‌ 22 నాటికి 9.15 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాలి. కానీ రుతుపవనాల రాక ఆలస్యం కావడం, వర్షాలు అరకొరగా మాత్రమే పడటంతో ఈనెల 22 నాటికి కేవలం 2.31 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణంగా నమోదు కావాల్సిన వర్షపాతంలో 75 శాతం లోటు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కాగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 0.5 సెంటీమీటర్ల (5 మిల్లీమీటర్లు) సగటు వర్షపాతం నమోదైంది. వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, జనగామ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా యాదగిరిగుట్ట పట్టణంతో పాటు యాదాద్రి కొండపై గురువారం భారీ వర్షం కురిసింది. కొండపై భక్తులు తల దాచుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. కొండ కింద గల సెంట్రల్‌ పార్కింగ్‌లో వాహనాలు నీట మునిగిపోయాయి. 

ఉపరితల ఆవర్తనం.. 
పశ్చిమ దిశ నుంచి గాలులు రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 – 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు నమోదు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి రాష్ట్రానికి బలంగా గాలులు వీస్తున్నాయని వివరించింది. 

పిడుగుపాటుకు రైతు మృతి 
శంషాబాద్‌ రూరల్‌: మండలంలోని ననాజీపూర్‌ గ్రామానికి చెందిన అయినాల ఇంద్రసేనారెడ్డి (46) గురువారం సాయంత్రం కౌలు భూమిలో బంతినారు వేస్తున్నాడు. ఇంతలో ఉరుములు, మెరుపులతో వాన ప్రారంభం కాగా అతనిపై పిడుగు పడింది. దీంతో  స్పృహ తప్పిన ఇంద్రసేనారెడ్డిని స్థానికులు  శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అతనికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.  

Advertisement
Advertisement