బియ్యం ఇవ్వలేం! | Sakshi
Sakshi News home page

బియ్యం ఇవ్వలేం!

Published Thu, Jun 29 2023 3:13 AM

Telangana Govt On sending rice to Karnataka and Tamil Nadu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని ఓవైపు పాలకులు చెబుతుంటే.. మరోవైపు పక్క రాష్ట్రాలు తమ అవసరార్ధం కొనుగోలు చేస్తామన్న బియ్యం కూడా అందించలేక అధికార యంత్రాంగం సతమతమవుతోంది. కర్ణాటకలో ఎన్నికల హామీ అయిన ‘అన్న భాగ్య పథకం’కింద రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి అదనంగా 5 కిలోలు ఇచ్చేందుకు ఆ రాష్ట్రంలో బియ్యం అందుబాటులో లేవు.

అలాగే తమిళనాడుకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా ఇచ్చేందుకు బియ్యం అవసరమయ్యాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థలూ తెలంగాణను సంప్రదించాయి. దీంతో పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌లలో మూలుగుతున్న బియ్యం ని ల్వలను, మిల్లులు బకాయి పడిన లక్షల టన్నుల బియ్యా న్ని సేకరించి ఈ రెండు రాష్ట్రాలకు పంపించాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌.. సంస్థ ఎండీ, కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు సూచించారు.

అయితే బియ్యం పంపడం సాధ్యం కాదంటూ కమిషనర్‌ చేతులెత్తేసినట్లు సమాచారం. ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్వహించిన పౌరసరఫరాల సంస్థ సమీక్ష సమావేశంలోనూ ఆయ న ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో మంత్రులు గంగుల, హరీశ్‌రావు, సీఎస్‌ సమావేశమై దీనిపై చర్చించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది.
 
33 లక్షల మెట్రిక్‌ టన్నులు కావాలన్న 
రెండు రాష్ట్రాలు: కర్ణాటకకు నెలకు 2.18 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీల) బియ్యం అవసరం ఉందంటూ ఆ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల సంస్థ ఎండీ ఈ నెల 3న అనిల్‌కుమార్‌కు లేఖ రాశారు. ఈ లెక్కన సంవత్సరానికి 27 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం. అలాగే తమిళనాడు నుంచి కూడా ఈ నెల 23న ఒక లేఖ అందింది. రాష్ట్ర పీడీఎస్‌ అవసరాల కోసం 4 ఎల్‌ఎంటీల బాయిల్డ్‌ రైస్, 2 ఎల్‌ఎంటీల ముడి బియ్యం అవసరం అని ఆ రాష్ట్రం కోరింది.  

రాష్ట్ర మిల్లర్ల నిర్వాకంతోనే వెనకడుగు? 
తెలంగాణలో ఏటా సగటున కోటిన్నర మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లింగ్‌కు వస్తోంది. ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే వచ్చే 67 శాతం బియ్యం లెక్కన ఏటా సుమారు కోటి మెట్రిక్‌ టన్నుల బియ్యం వస్తుంది. ఇందులో ఎఫ్‌సీఐకి 50 ఎల్‌ఎంటీ అప్పగించినా, మరో 50 ఎల్‌ఎంటీ వరకు స్టేట్‌ పూల్‌ కింద రాష్ట్రం వద్దనే ఉంటుంది. అయితే మిల్లర్లు నాణ్యమైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవడం, రోజుకు కనీసం 8 నుంచి 10 వేల మెట్రిక్‌ టన్నుల మేర కూడా ఎఫ్‌సీఐకి అప్పగించకపోవడం వంటి కారణాలతో ఒక సీజన్‌ ధాన్యం సీఎంఆర్‌గా ఎఫ్‌సీఐ గోడౌన్‌లకు చేరుకునేందుకు 18 నెలల వరకు పడుతోంది.

ఈ పరిస్థితుల్లో మిల్లర్ల మీద నమ్మకంతో పక్క రాష్ట్రాలకు విక్రయించే ఒప్పందాలు చేసుకుంటే ఇబ్బందులు తప్పవని కమిషనర్‌ భావిస్తున్నట్లు సమాచారం. మిల్లర్లు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 4.5 ఎల్‌ఎంటీ బియ్యం ఇవ్వాల్సి ఉంది. 2019–20, 21 బాపతు బియ్యం 1.25 ఎల్‌ఎంటీలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బియ్యాన్ని 25 శాతం అదనపు జరిమానాతో వసూలు చేసినా, అది పౌరసరఫరాల సంస్థ ద్వారా పీడీఎస్‌కు తరలుతుంది.

ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐకి ఇచ్చే బియ్యంలో కోత పెట్టడం ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు అవకాశాలున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు. అలాగే మిల్లర్లపై ఒత్తిడి పెంచి ఏ సీజన్‌ బియ్యం ఆ సీజన్‌లో మిల్లింగ్‌ చేయిస్తే పక్క రాష్ట్రాలకు విక్రయించడం కష్టం కాదని ఓ రిటైర్డ్‌ అధికారి వ్యాఖ్యానించారు.  

బియ్యానికి బదులు డబ్బులు 
అన్న భాగ్య పథకంపై కర్ణాటక నిర్ణయం  
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చి న హామీల్లో ఒకటైన అన్న భాగ్య పథకం అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పథకం ప్రకారం దారిద్య్ర రేఖకి దిగువన ఉన్న కుటుంబాలకు అయిదు కేజీలు అదనంగా బియ్యం ఇవ్వాల్సి ఉంది.జూలై 1 నుంచి ఈ పథకం అమలు చేయాల్సి ఉండగా బియ్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో బియ్యానికి బదులుగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది.

బుధవారం జరిగిన కర్ణాటక రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేజీ బియ్యానికి రూ.34 చొప్పున 5 కేజీలకయ్యే ధర మొత్తం వారి ఖాతాల్లో వేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి కె.హెచ్‌. మునియప్ప విలేకరులకు వెల్లడించారు.‘‘రాష్ట్ర అవసరాలకు సరిపడా బియ్యాన్ని ఇవ్వడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు.

ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం కేజీ బియ్యం ధర రూ.34.  అవసరమైన బియ్యం ప్రభుత్వం సేకరించే వరకు అర్హులైన లబ్దిదారులందరికీ బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తాం’’ అని వివరించారు. ఒక కార్డులో ఒకే వ్యక్తి ఉంటే రూ.170, ఇద్దరు ఉంటే రూ.340, ఒకవేళ అయిదుగురు సభ్యులుంటే వారి ఖాతాలో రూ.850 వేస్తామని మంత్రి వివరించారు.   

Advertisement
Advertisement