కళాకారుడికి అశ్రునివాళి: ముగిసిన సాయిచంద్‌ అంత్యక్రియలు

29 Jun, 2023 19:13 IST|Sakshi

Telangana Folk Singer Sai Chand Last Rites Updates

 గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌కు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. వనస్థలీపురం సాహెబ్‌నగర్‌ శ్మశాసనవాటికలో సాయిచంద్‌ అంత్యక్రియలు జరిగాయి. చితికి సాయిచంద్‌ కొడుకు నిప్పంటించారు.
గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. సాయి చంద్‌ భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో సాయి చంద్‌ భార్య భావోద్వేగానికి లోనై రోదించగా.. కేసీఆర్‌ ఆమెను ఓదార్చారు.

తెలంగాణ జానపద కళాకారుడు, ఉద్యమ గాయకుడు సాయి చంద్‌ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్‌ కంటతడి పెట్టారు.

► తెలంగాణ సమాజం ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయింది. సాయి చంద్‌ కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం కేసీఆర్‌

► కాసేపట్లో గుర్రం గూడకు ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు


సాయి చందు పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రజా యుద్ధనౌక గద్దర్

► సాయిచంద్‌ మృతిపై సంతాప ప్రకటన వెలువరించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. సాయిచంద్‌ నివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. సాయిచంద్‌ మృతదేహానికి నివాళులర్పించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. 

‘‘రాతి గుండెల్ని సైతం కరిగించిన గాత్రం సాయిచంద్‌ది. మా అందరికీ ఆత్మీయుడతను. చనిపోయడనే వార్త జీర్ణించుకోలేక పోతున్నం. ఆయన లేని లోటు తీర్చలేదు. హైదరాబాద్‌లో ఉంటే బ్రతికే వాడేమో!. అత్యంత చిన్న వయస్సులోనే చనిపోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. 

సాయి చంద్‌ పాటలు అందరినీ కదిలిస్తాయ్‌: మంత్రి తలసాని

► సాయి చంద్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కంట తడి పెట్టారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ‘‘తమ్ముడు సాయి చంద్ లేడని ఊహించుకుంటేనే బాధ గా ఉంది. చిన్న వయసు లో చనిపోవడం దురదృష్టం. నిజాయితీ గల సైనికుడు సాయి చంద్. తన పాట  ఖండాంతరాలు  దాటాయి. నా మనుసుకు దగ్గర వ్యక్తి కూడా. చాలా సార్లు మా ఇంటికి వచ్చాడు. సీఎం కెసీఆర్ కూడా తనను ఇంకా ఎక్కువ గౌరవించుకోవాలి అనేవారు. సాయిను మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
 

► తెలంగాణ ఉద్యమ గాయకుడు, బీఆర్‌ఎస్‌ నేత.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌(39) హఠాన్మరణం చెందారు. సీఎం కేసీఆర్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. గుర్రంగూడలో ఉన్న ఆయన భౌతికకాయానికి ప్రముఖులు వెళ్లి నివాళులు అర్పించి.. ఆయన కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. కన్నీటితో నివాళులర్పిస్తున్నారంతా.

► తెలంగాణ కళాకారుడు, మలిదశ ఉద్యమ సమయంలో తన గాత్రంతో ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రాజేసిన గాయకుడు సాయిచంద్‌ హఠాన్మరణం.. యావత్‌ తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. కేవలం 39 ఏళ్ల వయసులో.. అదీ ఉన్నపళంగా గుండెపోటుతో కన్నుమూయడాన్ని కుటుంబ సభ్యులు, అతన్ని అభిమానించేవాళ్లు తట్టుకోలేకపోతున్నారు. 

ఇదీ చదవండి: ఉద్యమ పాట.. ఆగింది

మరిన్ని వార్తలు