కాటన్‌పై కాటు | Sakshi
Sakshi News home page

కాటన్‌పై కాటు

Published Wed, Jul 12 2023 1:50 AM

10 lakh acres of ungerminated cotton seed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 33 జిల్లాలకు­గాను 16 జిల్లాల్లో వర్షాభావం నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ సీజన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, సోమవారం నాటికి 42.48 లక్షల ఎకరాల్లో సాగైంది. వాస్తవంగా గతేడాది ఇదే సమయానికి 53.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే ఈసారి ఏకంగా 11.31 లక్షల ఎకరాలు తక్కువగా సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతు­న్నాయి. సీజన్‌ ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈసారి కొద్దిపాటి వర్షాలకు రాష్ట్రంలో 28.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు.

కానీ వాటిని కాపాడుకోవడం కూడా రైతులకు సవాల్‌గా మారింది. వర్షాలు లేకపోవడంతో అవి మొలకెత్తే పరిస్థితి లేకుండాపోతోంది. వ్యవసాయశాఖ తాజా అంచనా ప్రకారం దాదాపు 10 లక్షల ఎకరాల్లో కూడా పత్తి మొలకెత్తలేదని అధికారులు చెబుతున్నారు. మరికొన్నిచోట్ల పత్తి భూమిలోనే మాడిపో­యిందని అంటున్నారు. దీంతో రైతులు మళ్లీ భూమిని దున్ని పత్తి వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

వాస్తవంగా పత్తి వేయడానికి ఈ నెలాఖరు వరకే గడువు. చిట్టచివరకు ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలి. ఆ తర్వాత పత్తి వేయడానికి అదనుపోయినట్లే. ఆలస్యమైతే చీడపీడలు ఆశిస్తాయి. పైపెచ్చు మళ్లీ దున్ని విత్తనాలు వేయాలంటే మరింత ఖర్చుతో కూడిన వ్యవహారం. మరోవైపు అనుకున్న వెరైటీలు దొరక్క ఏదో ఒక రకం విత్తనం వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈసారి ప్రభుత్వం కూడా పత్తి సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది. కనీసం 65 లక్షల ఎకరాలకైనా పెంచాలని రైతులకు కోరింది. కానీ పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. గతేడాది మేరకైనా పత్తి సాగవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పత్తి అదను దాటిపోతే దానికి బదులుగా మొక్క­జొన్న లేదా ఆముదం వంటి పంటలను రైతులు వేసుకోవాల్సి ఉంటుందని అధికా­రు­లు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై కసరత్తు
వర్షాలు లేకపోవడం, కాల్వల్లో నీటి విడుదల లేకపోవడంతో అనేకచోట్ల ఇంకా వరి నార్లు పోయలేదు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ఎలా గట్టెక్కుతుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెలా­ఖరు నాటికి కూడా ఇదే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఈ సీజన్‌ సాగు ప్రమాదంలో పడినట్లేనని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలో కంటింజెన్సీ ప్రణాళికపై వ్యవసాయశాఖ సమాలోచనలు చేస్తోంది. సకాలంలో పంటలు వేయని పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలన్న దానిపై ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యా­లయం శాస్త్రవేత్తలతో మంతనాలు జరుపుతోంది.

నార్లు వేయని పరిస్థితి నెలకొంటే వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని భావిస్తోంది. స్వల్పకాలిక రకాలైన వరి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని కిందిస్థాయి సిబ్బందిని వ్యవసాయశాఖ ఆదేశించింది. రోజువారీగా జిల్లా అధికారులతో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తోంది. 

ఖర్చు రెట్టింపైంది
నా రెండెకరాల భూమిలో 20 రోజుల క్రితం పత్తి గింజలు విత్తాను. కానీ వర్షాలు రాకపోవడంతో మొలకలు రాలేదు. దీంతో రెండోసారి పత్తి విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేసి విత్తాను. పత్తి విత్తనాలకు రూ.3,500, సాగుకు రూ.6,000, విత్తడానికి రూ.1,000 ఖర్చయింది. వర్షం రాకపోవడంతో రెండుసార్లు విత్తనాలు వేయడంతో పెట్టుబడి రెట్టింపైంది. ఇప్ప­టి­వరకు రూ.21 వేలకుపైగా ఖర్చయింది.  – రేఖ శ్రీధర్, రైతు, నర్సింహులపేట, మహబూబాబాద్‌ జిల్లా

వానల్లేక మొలకెత్త లేదు
జూన్‌ మొదటి వారంలో పొడి దుక్కుల్లో నాలుగెకరాల్లో పత్తి విత్తనాలు పెట్టాం. సమయానికి వర్షాలు పడలేదు. ఎండ తీవ్రత బాగా ఉంది. దీంతో విత్తనాలు మొలకెత్తలేదు. మరోసారి విత్తనాలు వేయాల్సి వచ్చింది. రెండోసారి పెట్టిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతు­న్నాయి. రెండుసార్లు వేయాల్సి రావడంతో ఖర్చు ఎక్కువైంది. – చామకూరి రమేష్, పిండిప్రోలు, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా

Advertisement

తప్పక చదవండి

Advertisement