Hyderabad: తుదిదశకు సైక్లింగ్‌ ట్రాక్‌ పనులు.. రెండు నెలల్లో అందుబాటులోకి | Sakshi
Sakshi News home page

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌.. రెండు నెలల్లో సైక్లింగ్‌ ట్రాక్‌ అందుబాటులోకి

Published Sat, Jan 7 2023 1:06 PM

23 KM Cycle Track In Hyderabad Will Start In March - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అధునాతన సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరో రెండు నెలల్లో ట్రాక్‌పై సైకిళ్లు పరుగులు తీయనున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకొని 23 కిలోమీటర్ల మార్గంలో ట్రాక్‌ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యారణ పరిరక్షణ కోసం సైక్లింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ఈ నిర్మాణాన్ని చేపట్టింది. గతేడాది సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

సుమారు రూ.100 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును రెండు మార్గాల్లో చేపట్టారు. ఔటర్‌ను ఆనుకొని నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్‌ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, కొల్లూరు నుంచి నార్సింగి వరకు 14.5 కిలోమీటర్ల మార్గంలో 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్‌లలో ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలకు ధీటైన అభివృద్ధి జరుగుతుందని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో  రూపొందిస్తోన్న సైకిల్‌ ట్రాక్‌ నగర ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు.   

ఆరోగ్యవిహారం... 
సైక్లింగ్‌ ట్రాక్‌లో సైకిళ్లపైన పరుగులు తీయడం కేవలం ఒక వ్యాయామ ప్రక్రియగానే కాకుండా ఒక విహారంలాంటి అనుభూతిని కలిగించేవిధంగా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ట్రాక్‌ పొడవునా అక్కడక్కడా రెస్ట్‌రూమ్‌లు, కెఫెటేరియాలు, బ్రేక్‌ఫాస్ట్‌ సెంటర్‌లు ఉంటాయి. అలాగే  సైకిళ్లను  ఇక్కడే అద్దెకు తీసుకోవచ్చు. సైకిళ్లకు పంక్చర్‌లయినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మరమ్మతులు చేసి ఇస్తారు.

ట్రాక్‌ పొడవునా తాగునీటి సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రాలు ఉంటాయని  హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. అలాగే ట్రాక్‌ను పూర్తిగా పచ్చదనం ఉట్టిపడేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ మార్గంలో సైక్లింగ్‌ చేసేవారికి ఆకుపచ్చ నడవాలు పరుగులు తీస్తున్న అనుభూతి కలుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ ట్రాక్‌పైన సైక్లింగ్‌ పోటీలను కూడా నిర్వహించనున్నారు. మరోవైపు భద్రత దృష్ట్యా ట్రాక్‌ పొడవునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.  

సౌర విద్యుత్‌ వినియోగం... 
ట్రాక్‌పై కప్పును పూర్తిగా సౌరఫలకలతో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 16 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను ట్రాక్‌ అవసరాలకు వినియోగించనున్నారు. లైట్లు, తదితర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ఇక్కడ వినియోగించగా మిగిలిన విద్యుత్‌ను ఇతరులకు వినియోగించే అవకాశం ఉంది. ఈ 23 కిలోమీటర్‌ల ట్రాక్‌ నిర్మాణం పూర్తయిన తరువాత రెండో దశలో  గండిపేట వద్ద  అతి పెద్ద సైకిల్‌ ట్రాక్‌ నిర్మిచనున్నారు.  

Advertisement
Advertisement