TSRTC Introduces T9-30 Ticket for Daily Commuters - Sakshi
Sakshi News home page

T9-30 Ticket: ‘పల్లెవెలుగు’లో మరో రాయితీ టికెట్‌

Published Thu, Jul 27 2023 3:16 AM

30 km Rs.50 Rupees in the range Ranuponu facility - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో వెళ్లే ప్రయాణికులను బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ. దూరం ప్రయాణించే వారికి రాయితీ టికెట్‌ను అందుబా టులోకి తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం సంస్థ టీ9–60 పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికులకు రూ.100కే రాను పోను రాయితీ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దానికి స్పందన తక్కువగా ఉండటంతో, ఇప్పుడు టీ9–30 పేరుతో 30 కి.మీ. పరిధిలో తిరిగే వారికి రూ.50కే రానుపోను వర్తించేలా రాయితీ టికెట్‌ను ప్రారంభించింది. ఈ టికెట్లు గురువారం నుంచి కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. 

ఆటోల్లో ప్రయాణించేవారిపై గురి..
చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆటోలను ఆశ్రయి స్తున్నారు. పల్లెవెలుగు బస్సు టికెట్‌పై రాయితీ ప్రకటిస్తే వారిలో కొందరైనా బస్సులెక్కు తారని ఆర్టీసీ భావిస్తోంది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లో 30 కి.మీ. నిడివిలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు మూడున్నర లక్షలుగా ఉంది. అంతకు రెట్టింపు జనం అదే పరిధిలో ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రాయితీ టికెట్‌ తీసుకుంటే.. రూ.50తో గమ్యం వెళ్లితిరిగి రావచ్చు. దానికి అదనంగా రూ.20 చెల్లించి కాంబి టికెట్‌ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కూడా అదే టికెట్‌తో రాను, పోనూ ప్రయాణించవచ్చు.

కొద్ది రోజుల క్రితం 60 కి.మీ. నిడివిలో ప్రయాణించేవారికోసం రూ.100కే రానుపోను టికెట్‌ తీసుకురాగా, 60 కి.మీ. పరిధిలో తిరిగే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో దానికి పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది డిపో మేనేజర్లు కోరటంతో కొత్త విధానం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ టికెట్‌ చెల్లుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 వరకు టికెట్ల జారీ ఉంటుంది. 30 కి.మీ. పరిధిలో పొరుగు రాష్ట్రంలో ప్రయాణం ఉంటే.. అక్కడ కూడా ఇది చెల్లుబాటు (టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లోనే) అవుతుందని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ఆవిష్కరించారు.  

Advertisement
Advertisement