పేద కుటుంబంలో వెలుగు నింపారు

19 Apr, 2022 03:16 IST|Sakshi
కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యులతో చిన్నారి, తల్లిదండ్రులు   

9నెలల చిన్నారికి  రూ.20 లక్షలు ఖర్చయ్యే సర్జరీ ఉచితంగా..

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): పుట్టుకతోనే బైలియరీ అట్రేజియా (పిత్తవాహిక మూసుకుపోవడం)తో బాధపడుతున్న 9 నెలల చిన్నారికి అత్యం త ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా చేశారు. సోమవారం కిమ్స్‌ కాలేయ విభాగపు అధిపతి డాక్టర్‌ రవిచంద్‌ సిద్దాచారి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా తిరుమలగిరి గ్రామానికి చెందిన శంకర్, శోభారాణి దంపతులకు పుట్టిన పాపకు నెల రోజులకే కామెర్లు వచ్చాయి. నగరంలోని ఓ ఆస్పత్రిలో పాపకు శస్త్ర చికిత్స చేసినా కామెర్లు తగ్గలేదు.

పైగా కాలేయం విఫలమవుతున్న లక్షణాలు కనిపించాయి. దీంతో 2 నెలల క్రితం తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి పాపను తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి బైలియరీ అట్రేజియాతో బాధపడుతోందని గుర్తించారు. దీనికి కాలేయ మార్పిడే పరిష్కారమని సూచించారు. బిడ్డకు కాలేయం ఇచ్చేందుకు తల్లి ముందుకొచ్చినా శస్త్ర చికిత్సకు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిసి దంపతులిద్దరికీ దిక్కుతోచకుండా పోయింది. వీరి పరిస్థితిని గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఉచితంగా సర్జరీ చేసింది. కోలుకున్నాక  చిన్నారిని డిశ్చార్జ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు