మొక్కల కన్నా ముస్లింలు హీనమా?

5 Oct, 2021 04:08 IST|Sakshi

హరితహారం కన్నా తక్కువ ఖర్చు చేస్తారా?

మైనారిటీల సంక్షేమంపై చర్చలో అక్బరుద్దీన్‌ ఒవైసీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో హరితహారం కోసం ఖర్చు చేస్తున్నన్ని నిధులు కూడా మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ విమర్శిం చారు. ‘ఏడేళ్లలో మైనార్టీల సంక్షేమంపై ప్రభుత్వం రూ.6.199 కోట్లు ఖర్చు చేసింది. అదే హరితహారంపై ఇంతవరకు రూ.6,555 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఒక్క ఏడాదే రూ.548 కోట్లు వ్యయం చేశారు. మొక్కలు, చెట్లకన్నా మైనార్టీలు హీనమై పోయారా? ముస్లింలకు హరితహారం కన్నా తక్కువ నిధులు ఖర్చు చేస్తారా..?’ అని నిల దీశారు. సోమవారం శాసనసభలో మైనారిటీ సంక్షే మం, పాతబస్తీ అభివృద్ధిపై చర్చను అక్బరుద్దీన్‌ ప్రారంభించారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు సంబంధించి ఒక్కోసారి ఒక్కోరకమైన లెక్కలు ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తప్పుడు లెక్కల మాదిరే మైనార్టీల ప్రగతి కూడా ఉందన్నారు.

కొనసాగుతున్న వివక్ష
రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో వివక్ష కొనసాగుతోందని అక్బరుద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అం దుతున్న ఫలాలు మైనారిటీలకు దక్కడం లేదంటూ గణాంకాలతో సహా వివరించారు. మైనారిటీ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్పులు అందజేసే విషయంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం చిన్నచూపు చూస్తోంద న్నారు. 2019 ఎన్నికల తర్వాత మైనార్టీల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని చెప్పారు. 2014–15 నుంచి ఇంతవరకు మసీదుల అభివృధ్ధికి, దర్గాల పనులు, ఖబరిస్థాన్‌ల కోసం మొత్తంగా రూ.210 కోట్లతో 800ల జీవోలు విడుదల చేసినా ఒక్క రూపాయిని కూడా ప్రభు త్వం ఇంతవరకు విడుదల చేయలేదని విమర్శిం చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 56,653 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల గుర్తింపు విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కుటుంబ వార్షికాదాయ పరిమితి రూ. 8 లక్షలు ఉంటే, మైనారిటీలకు రూ.2 లక్షలకే పరిమితం చేశారని, దీనిని మార్చాలని అక్బరుద్దీన్‌ కోరారు.

పాతబస్తీపై నిర్లక్ష్యం
హైదరాబాద్‌ పాత నగరాన్ని అభివృద్ధి చేయడంలో వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం కలుగు తోందని అక్బరుద్దీన్‌ చెప్పారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం, చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ), కుతుబ్‌షాహి టూంబ్స్‌ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మెట్రో రైలు నిర్మాణం, మోనోట్రైన్‌ తీసుకురావడం వంటి అంశాల్లో పాతబస్తీని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మెట్రో మూసీ దాటలేదని చెప్పారు. నాలాల నిర్మాణం, దర్గాలు, పహాడీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని అధునాతనంగా నిర్మించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని అక్బరుద్దీన్‌ కొనియాడారు. హైదరాబాద్‌ పాతబస్తీ అభివృద్ధికి వైఎస్సార్‌ ఆనాడే రూ.2 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని తెలిపారు.

12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: భట్టి విక్రమార్క
మైనారిటీ ముస్లింలకు రాష్ట్రంలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ (వైఎస్‌) ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఈ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని చెప్పిన టీఆర్‌ఎస్‌ అందుకు కట్టుబడి ఉండాలని కోరారు. రాజకీయ కారణాలతోనే పాతబస్తీని అభివృద్ధి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. కబ్జాలకు ఓల్డ్‌సిటీ అడ్డాగా మారిందని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్‌ పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు