AP Govt Arguments On Margadarsi Case In Telangana High Court - Sakshi
Sakshi News home page

ఆడిటర్‌ను నియమించే అధికారం ఉంది.. టీఎస్‌ హైకోర్టులో ఏపీ సర్కార్‌ వాదనలు 

Published Fri, Apr 21 2023 8:45 AM

Ap Govt Arguments On Margadarsi Case In Telangana High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన అవకతవకలపై ప్రాథమిక ఆధారాలున్నప్పుడు నిశితంగా పరిశీలించి నిగ్గు తేల్చేందుకు ప్రైవేట్‌ ఆడిటర్‌ను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్లు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అసలు ఈ పిటిషన్‌పై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు లేదు’ అని తెలంగాణ హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నివేదించింది.

మార్చి 13, 15, 18న ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌–ఐజీ ఇచ్చిన ఆదేశాలను కొట్టి వేయడంతోపాటు ఆడిటర్‌ వేములపాటి శ్రీధర్‌ నియామకాన్ని, తమ సంస్థలో ఆయన ద్వా­రా ఆడిటింగ్‌ చేపట్టడాన్ని రద్దు చేయాలంటూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌కుమార్‌ సుదీర్ఘంగా వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ గోవింద్‌రెడ్డి, ఆడిటర్‌ శ్రీధర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పట్టాభి, పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపించారు.

హైకోర్టుల పరిధిని సుప్రీం స్పష్టంగా చెప్పింది.. 
‘తనిఖీలు నిర్వహించిన 37 బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. కేసులు అక్కడే నమోదయ్యాయి. విచారణ అధికారులు కూడా అక్కడివారే. అలాంటప్పుడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేయడం సరికాదు. పరిధి కాకున్నా మార్గదర్శి ప్రతిసారి తెలంగాణ హైకోర్టులోనే పిటిషన్లు దాఖలు చేస్తోంది. వీటిపై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు లేదు. మార్గదర్శి నుంచి స్వా«దీనం చేసుకున్న డాక్యుమెంట్లు, రిజిస్టర్లను పరిశీలించగా అనేక అక్రమాలు వెలుగులోకొచ్చాయి. దీంతో వీటిపై క్షుణ్ణంగా పరిశీలన జరిపేందుకు ఆడిటర్‌ను నియమించాం. చిట్‌ఫండ్స్‌ చట్టం సెక్షన్‌ 61 సబ్‌ సెక్షన్‌ 2 ప్రకారం ప్రైవేట్‌ ఆడిటర్‌ను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.

సబ్‌ సెక్షన్‌ 4 ప్రకారం డాక్యుమెంట్లను ఆడిట్‌ చేసే అధికారం కూడా ఉంది. ఒకటి రెండు అంశాల్లో మినహా  ఏపీ హైకోర్టు పరిధిలోని అంశాల్లో తెలంగాణ హైకోర్టు కలుగజేసుకునే అవకాశం లేదు. ఇది ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. ప్రత్యేకంగా ఏపీకి హైకోర్టు ఏర్పడ్డాక తెలంగాణ హైకోర్టుకు అక్కడి అంశాలపై పరిధి ఉండదని చట్టం చెబుతోంది. డెట్‌ రిలీఫ్‌ ట్రిబ్యునల్‌(డీఆర్‌టీ)కి సంబంధించి డీఆర్‌టీ–2 రాయలసీమ పరిధి వరకే జోక్యం చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే ఇందులో కూడా కలుగచేసుకోరాదని తెలంగాణ హైకోర్టు గతంలో పేర్కొంది.

హైకోర్టుల పరిధికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టంగా నిర్వచించింది. ద స్టేట్‌ ఆఫ్‌ గోవా వర్సెస్‌ సమ్మిట్‌ ఆన్‌లైన్‌ ట్రేడ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు దీనిపై కీలక తీర్పు వెలువరించింది. ఒక హైకోర్టు పరిధిలో మరో హైకోర్టు పరిధి దాటి కలుగజేసుకోరాదని ఆదేశించింది. ‘కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌’ ఏ రాష్ట్రంలో జరిగితే విచారణ కూడా అదే హైకోర్టు పరిధిలో జరగాలని ఉత్తర్వులు ఇచ్చింది.

ఏపీ హైకోర్టు పరిధిలో కలుగజేసుకోలే­మ­ని ఇదే హైకోర్టు పలు తీర్పులు కూ­డా ఇచి్చంది. మా­రుతి జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ ఫ్యాక్టరీ అండ్‌ అదర్స్‌ వర్సెస్‌ డెట్స్‌ రికవరీ ట్రిబ్యునల్‌–2, హైదరాబాద్‌ అండ్‌ అదర్స్‌కు సంబంధించిన కేసులో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బెంచ్, జస్టిస్‌ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం ఏపీ హైకోర్టు పరిధిలో కలుగజేసుకోలేమని స్పష్టం చేసింది’ అని గోవింద్‌రెడ్డి నివేదించారు. 

60 దశాబ్దాలైనా తప్పు తప్పే అవుతుంది 
‘సేకరించిన నగదును అక్రమ మార్గాల్లో సొంత కంపెనీలకు, షేర్‌ మార్కెట్లకు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు మార్గదర్శి మళ్లిస్తోంది. దాదాపు 46 రోజుల తర్వాత కోర్టును ఆశ్రయించడం సమర్థనీయంకాదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఒక చిట్‌ఫండ్‌ ఎక్కువ.. మరో చిట్‌ ఫండ్‌ తక్కువ కాదు.. అన్నీ సమానమే. అన్ని చిట్‌ఫండ్స్‌లోనూ తనిఖీలు చేస్తున్నాం. అవకతవకలు ఎక్కడ జరిగినా వదిలే ప్రసక్తే లేదు. దాదాపు 6 దశాబ్దాలుగా చిట్‌ఫండ్స్‌ నడుపుతున్నామని పిటిషనర్‌ చెబుతున్నారు.

60 దశాబ్దాలుగా నడుపుతున్నా.. తప్పు తప్పే అవుతుంది కానీ ఒప్పు కాదన్న విషయం గ్రహించాలి. చిట్‌ ఫండ్స్‌ చట్టం 1982 ప్రకారమే ఆడిటింగ్‌ జరుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా మార్గదర్శి బ్యాలెన్స్‌ షీట్‌ ఫైల్‌ చేయడం లేదు. లాభ నష్టాలకు సంబంధించి దీన్ని ఏటా ప్రభుత్వానికి తప్పకుండా సమర్పించాలి. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీ వద్ద ఫైల్‌ చేస్తున్నామంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది చట్టాలను ఉల్లంఘించడమే. పత్రికల్లో ఇచి్చన ప్రకటనలు చట్టబద్ధం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వం దురుద్దేశంతో ఇదంతా చేస్తోందని ఆరోపించడం సరికాదు. అక్రమాలు తేలితే అన్ని చిట్‌ఫండ్స్‌పై చర్యలు తీసుకుంటాం. వీటిని పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని స్పెషల్‌ జీపీ గోవింద్‌రెడ్డి కోరారు.
చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు?

మా వాదనలు వినకుండా ఉత్తర్వులివ్వొద్దు.. 
‘ఈ కేసులో ప్రభుత్వం నియమించిన ఆడిటర్‌ కౌంటర్‌ దాఖలు చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దు. ఆడిటర్‌ ఎవరికీ అనుకూలం కాదు.. ఎవరికీ వ్యతిరేకం కూడా కాదు. రికార్డుల పరిశీలనకు ప్రభుత్వం నియమించడంతో విధి నిర్వహణలో భాగంగా పరిశీలన చేస్తున్నాం’ అని ఆడిటర్‌ తరపు న్యాయవాది పట్టాభి పేర్కొన్నారు. ‘ప్రభుత్వం దురుద్దేశంతోనే ఆడిటింగ్‌ చేపడుతోంది. దీనివల్ల సంస్థ భవిష్యత్తు  ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆడిటర్‌ను నియమిస్తూ ఇచి్చన ఆదేశాలను రద్దు చేయాలి’ అని రోహత్గీ అభ్యర్థించారు.  

Advertisement
Advertisement