యాదాద్రిలో ఆర్జిత సేవలు ప్రారంభం

4 Oct, 2020 11:32 IST|Sakshi

పరిమిత సంఖ్యలో శ్రీస్వామి పూజలకు అనుమతి

తెరచుకున్న తలనీలాల కౌంటర్లు

కోవిడ్‌–19కు అనుగుణంగా ఆర్జిత పూజలు, తలనీలాల సమర్పణ

6నెలల 11 రోజుల తరువాత ఆర్జిత సేవలకు అనుమతి

సాక్షి, యాదగిరిగుట్ట : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఉదయం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం అయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా మార్చి 22 నుంచి రద్దు అయిన ఆర్జిత సేవలు 196 రోజుల తర్వాత పున:ప్రారంభమయ్యాయి. దీంతో స్వామి వారి దర్శనానికి దాదాపు రెండు నుంచి  నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. భక్తుల రద్దీ ఉండటంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించే క్రమంలో థర్మల్ స్క్కీనింగ్,శానిటైజర్ ఏర్పాటు చేశారు. 

ఆదివారం (నేటి) నుంచి శ్రీస్వామి వారి ఆర్జిత సేవలైన అభిషేకం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీస్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, సువర్ణ పుష్పార్చన పూజలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు చేసుకునేందుకు భక్తులను అనుమతించినట్లు ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా భక్తులు మొక్కులుగా సమర్పించే తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను సైతం తెరిచినట్లు తెలిపారు.

కొండ కింద గల తులసీ కాటేజీలో సైతం ఒక కుటుంబంలో ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న కుటుంబానికే గదులు కేటయిస్తామన్నారు. వీటన్నింటికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి, కోవిడ్‌–19 నిబంధనల ప్రకారం జరిపించనున్నట్లు చెప్పారు. అంతే కాకుండా వేకువజామున 4గంటలకు తెరచి రాత్రి 9.45గంటల వరకు ఆలయంలో పూజలు జరిపించనున్నట్లు తెలిపారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. 

ఇక యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం ఆర్జిత సేవలను ప్రారంభించనున్నట్లు ఈవో వెల్లడించారు. అంతే కాకుండా ఆలయ దర్శన వేళలను మార్పు చేసినట్లు తెలిపారు. వేకువ జామున 4 గంటల నుంచి రాత్రి 9.45గంటల వరకు నిత్య కైంకర్యాలను కొనసాగిస్తామన్నారు. ఇక శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి బాల ఆలయంలో నిత్య కైంకర్యములు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పూజలన్నీ కోవిడ్‌–19 నిబంధనల ప్రకారం జరిపిస్తామన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే ప్రతి భక్తుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు. 

ఆరు నెలల తరువాత ఆర్జీత సేవలు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 6నెలల 11 రోజుల తరువాత ఆర్జిత సేవలు మొదలయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22వ తేదీన లాక్‌డౌన్‌ ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాదాద్రి ఆలయంలో భక్తులచే జరిపించే ఆర్జిత సేవలను దేవాదాయశాఖ ఆదేశాలతో రద్దు చేశారు. ఇక జూన్‌ 8వ తేదీ నుంచి భక్తులను శ్రీస్వామి వారి దర్శనానికి అనుమతిచ్చి, ఆన్‌లైన్‌లో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణాలను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకున్న భక్తుల పేరుతో పూజలు జరిపించారు. ఇక లాక్‌డౌన్‌లో వచ్చిన సడలింపులతో ఆదివారం కోవిడ్‌–19 నిబంధనలతో భక్తులకు ఆర్జిత సేవలను ఆలయ అధికారులు అనుమతిచ్చారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా