Art Of Living Launched The India Meditates Campaign - Sakshi
Sakshi News home page

‘ఇండియా మెడిటేట్స్’ ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్

Published Thu, Jul 27 2023 4:09 PM

Art Of Living Launched The India Meditates Campaign - Sakshi

బెంగుళూరు\హైదరాబాద్‌: ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘హర్ ఘర్ ధ్యాన్’ కార్యక్రమానికి తోడుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ నెల 24 నుండి 31 వరకూ ‘ఇండియా మెడిటేట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విభిన్న నేపథ్యాలకు చెందిన అన్ని వయస్సుల వ్యక్తులకూ ధ్యానాన్ని పరిచయం చేసి వారిలో స్వీయ అవగాహన తీసుకురావటం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంపూర్ణ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15న) ముగుస్తుంది. దేశపు సర్వతోముఖ అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా ఈ కార్యక్రమం నిలిచిపోనుంది.

ఇండియా మెడిటేట్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతీరోజూ ఎనిమిది సార్లు (ఉదయం 6గం, 7గం, 8గం. లకు, మధ్యాహ్నం 2గం, 3గం, 4గం. లకు, మరలా సాయంత్రం 7గం, 8గం. లకు)ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా ధ్యాన శిక్షణను అందిస్తున్నారు. ఈ ప్రత్యక్ష ఆన్‌లైన్ సెషన్‌లను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి నిపుణులైన శిక్షకులు నిర్వహిస్తారు ఇండియా మెడిటేట్స్ కార్యక్రమంలో పాల్గొనటం కోసం ఔత్సాహికులు indiameditates.org వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవలసి ఉంటుంది.

అనంతరం వారికి వాట్సప్ గ్రూపు ద్వారా ప్రత్యక్ష ప్రసారపు లింకు అందించబడుతుంది. అంతేకాక ఈ విధానంలో ధ్యానం నేర్చుకున్న వారంతా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్ ను కూడా అందుకుంటారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో 2 లక్షలమందికి పైగా భారతీయులు రిజిస్టర్ చేసుకున్నారు.

ఆజాది కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలలో భాగంగా భారతసాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ధ్యానానికి గల సుగుణాలను, మన జీవితాలలో ధ్యానం కలిగించే పరివర్తనను గురించి భారతీయులందరికీ తెలియజేయడమే దీని లక్ష్యం.అక్టోబరు 26, 2022న బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ చేతులమీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. అప్పటి నుండి హర్ ఘర్ ధ్యాన్ దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును పొందింది. ఇటీవలి కాలంలోనే లక్షలాదిమంది ఔత్సాహికులు అంతర్జాలం ద్వారా ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.

గురుదేవ్ రవిశంకర్ మాట్లాడుతూ “ధ్యానం మీ దృక్కోణాన్ని మార్చడానికి సహాయపడుతుంది. ఇది మీరు విషయాలను గ్రహించే విధానాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుస్తుంది. మీరు మాట్లాడే విధానం, వివిధ పరిస్థితులలో మీ స్పందనలు, మీరు వ్యవహరించే తీరు. వీటి పట్ల మీరు మరింత ఎరుకతో వ్యవహరిస్తారు’’ అని పేర్కొన్నారు.

ధ్యానం రోగనిరోధక శక్తిని పెంచుతుందని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించి, వారి మనస్సును అదుపులో ఉంచి శారీరక మానసిక సామర్థ్యాన్నిపెంచుకోవడానికి తోడ్పడుతుందని నిరూపించబడింది. ఇండియా మెడిటేట్స్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణా పోలీసు శాఖ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ధ్యానశిక్షణను ఇస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసు అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా సూచన మేరకు తెలంగాణాలోని 13 బెటాలియన్లలో సిబ్బందికి ధ్యానశిక్షణ ఇవ్వటం జరుగుతోంది. ఇప్పటికే 1000మందికి పైగా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ బ్యాంకు బ్రాంచీలలోని ఉద్యోగులందరికీ ఈ శిక్షణను అందిస్తున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఉద్యోగులు, కళాశాలలు, విద్యాలయాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్యాన శిక్షణను పొందారు.

Advertisement
Advertisement