4న ఆటో డ్రైవర్ల మహాధర్నా | Sakshi
Sakshi News home page

4న ఆటో డ్రైవర్ల మహాధర్నా

Published Mon, Jan 1 2024 4:01 AM

Auto workers meeting at Telangana Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’పథకంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా బస్‌స్టాండ్లు, బస్‌ డిపోల ముందు భిక్షాటన చేస్తామని ప్రకటించారు. అలాగే ఈ నెల 4న హైదరాబాద్‌ లోని ఇందిరాపార్క్‌ వద్ద ‘మహా ధర్నా’నిర్వహిస్తామని ప్రకటించారు.

మహాలక్ష్మి పథకం అమలుతో ఉపాధి దెబ్బతిన్న ఆటో కార్మికులకు ప్రభుత్వం ప్రతీనెల రూ.15 వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నేతలు రూప్‌ సింగ్, జి.రాంబాబు యాదవ్, వేముల మారయ్య తెలంగాణభవన్‌లో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత నెల 9వ తేదీ నుంచి అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది ఆటో, టాటా మ్యాజిక్, ఓలా, ఉబర్, సెవెన్‌ సీటర్‌ వాహన డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని వేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశం మేరకు డ్రైవర్ల స్థితిగతులను ఆధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు కార్మిక విభాగం నేతలు వెల్లడించారు.

Advertisement
Advertisement