హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం

26 Dec, 2020 00:47 IST|Sakshi

సాక్షి, గచ్చిబౌలి (హైదరాబాద్‌): న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం ఉందని సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. డిసెంబర్‌ 31న పబ్‌లు, బార్లు, హోటళ్లు, రిసార్ట్‌లు నిర్దేశించిన సమయానికే మూసేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్‌ నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని తెలిపారు. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

‘గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల లోనూ న్యూ ఇయర్‌ వేడుకల నిర్వహణకు అనుమతి లేదు. ఎవరైనా వేడుకలు నిర్వహిస్తే ఫిర్యాదు చేయాలి. బార్లు, పబ్‌లు, ఈవెంట్ల పేరిట సింగర్స్, డ్యాన్సర్లకు అనుమతి లేదు. ఎవరైనా ఈవెంట్ల పేరిట టికెట్లు విక్రయించినా, ఆన్‌లైన్‌లో పెట్టినా డయల్‌ 100, వాట్సాప్‌ కాల్‌కు ఫిర్యాదు చేయాలి. బార్లు, పబ్‌లు, స్టార్‌ హోటళ్లు, రిసార్ట్‌లపై నిఘా ఉంటుంది. ఎక్కడికక్కడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తాం’అని ఆయన తెలిపారు. కాగా నగరంలో నిషేధానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని సిటీ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఇక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు మాత్రం నగరవ్యాప్తంగా విస్తృతంగా చేపడుతున్నారు. 

మరిన్ని వార్తలు