Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వం అవినీతికి అలవాటు పడింది

Published Sat, Aug 29 2020 7:30 PM

Bandi Sanjay kumar Meet Cabinet Ministers In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఢిల్లీ పర్యటనలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి  సురేష్ అంగడిలను శనివారం వేర్వేరుగా కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, పనులు, ప్రాజెక్టులపై చర్చించారు. వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు విడుదల చేస్తున్న కేంద్రం నిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను సమయానుకూలంగా అందించకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని తెలిపారు. ఒక దశలో ఆగిపోయే విధంగా మారాయని, వాటిపై దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను సకాలంలో చెల్లించేలా ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రులను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, కమిషన్‌లకు అలవాటుపడి ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల రూపురేఖలు మార్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని మంత్రులకు వివరించారు.

తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరుస్తూ వారి ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విషయంలో రైతుల ప్రయోజనాల కోసం సంజయ్ కుమార్ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. బండి సంజయ్‌ చేసిన సూచనలు, సలహాలు విన్న వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే నిధులు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో రైతుబంధు పథకంలో అవినీతి జరుగుతోన్న విషయాన్ని ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ రైతుల స్థితిగతులు మార్చే పధకమని, దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని సంజయ్‌ కోరారు. 

రైల్వే శాఖ సహాయ మంత్రి అంగడి సురేష్తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన కొత్త, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి తదితర అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా కొత్తగా చేపట్టనున్న హసన్ పర్తి-కరీంనగర్ రైల్వే లైను ప్రాజెక్టు నివేదికపై విస్తృతంగా చర్చించారు. కరీంనగర్  పట్టణం తీగలకుంటపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, కరీంనగర్-నిజామాబాద్ రెండో లైను నిర్మాణం చేపట్టాలని సంజయ్‌ కేంద్ర మంత్రిని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి వెంటనే నివేదికలు సమర్పించాలని సమావేశంలో పాల్గొన్న రైల్వే అధికారులను ఆదేశించారు. గతంలో ఇచ్చిన నివేదికలనూ పరిశీలించి సమీక్షించారు. బండి సంజయ్ కుమార్ వినతి మేరకు విస్తృతమైన ప్రజా సేవలకు అనుకూలంగా ఉండేలా ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ అంగడి అధికారులను ఆదేశించారు. 

Advertisement
Advertisement