కొత్త రుణాలు కావాలా.. పాత అప్పు కట్టండి | Sakshi
Sakshi News home page

కొత్త రుణాలు కావాలా.. పాత అప్పు కట్టండి

Published Thu, Apr 4 2024 4:22 AM

Banks issued legal notices to farmers - Sakshi

రైతులకు తేల్చి చెప్తున్న బ్యాంకులు

మౌఖిక ఒత్తిళ్లు.. లీగల్‌ నోటీసులు సైతం జారీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు వారి ముక్కుపిండి మరీ తిరిగి వసూలు చేస్తున్నాయి. లీగల్‌ నోటీసులు, మౌఖిక ఆదేశాలు, ఒత్తిళ్లతో వడ్డీతో సహా రాబట్టుకుంటున్నా యి. కొన్ని బ్యాంకులు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద ఎంతోకొంత తగ్గించి వసూలు చేస్తున్నాయి. కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాల్సిందేనంటూ మెడపై కత్తి పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి.

కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లోని రైతుబంధు సొమ్మును లాగేసుకుంటున్నాయి. దీంతో కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ బ్యాంకులకు చెల్లిస్తున్నారు. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో అప్పులు తిరిగి చెల్లించలేదని, రుణమాఫీ జరగకపోగా వడ్డీ తడిచిమోపెడు అవుతోందని గగ్గోలు పెడుతున్నారు.

రుణమాఫీ జరిగేవరకు వేచిచూడాలని వేడుకుంటున్నా బ్యాంకులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బ్యాంకులు నోటీసులు..మరోవైపు వ్యవసాయశాఖ చేతులెత్తేయడం, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో తెలియక, కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేక రైతులు నలిగిపోతున్నారు.  

ముందుకు సాగని రూ.2 లక్షల రుణమాఫీ 
తమ పార్టీని గెలిపిస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇప్పుడదే పార్టీ అధికారంలోకి వచి్చంది. కానీ నాలుగు నెలలైనా ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు చేయలేదు.

కానీ రూ.2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని మాత్రం ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు.. ఎలా చేయాలి? ఏ తేదీ వరకు రుణమాఫీ చేయాలి అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.  

ఇప్పట్లో సాధ్యం కాదా? 
ఎన్నికల కోడ్‌తో ఇప్పటికిప్పుడు రుణమాఫీకి మార్గదర్శకాలు ఖరారు చేయడం, ఇతరత్రా ప్రక్రియ మొ దలు పెట్టడం కానీ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో జూన్‌ మొదటి వారం వరకు రుణ మాఫీపై అడుగు ముందుకు పడే అవకాశం లేదు. మరోవైపు వానాకాలం సీజన్‌ జూన్‌ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు మే నుంచే రైతులు సిద్ధం అవుతుంటారు.

విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, త్వరగా వర్షాలు కురిస్తే దుక్కులు దున్నడానికి సన్నాహాలు చేసుకుంటుంటారు. ఇంకోవైపు ఏప్రిల్‌ నుంచే వానాకాలం సీజన్‌ పంట రుణాల ప్రక్రియను బ్యాంకులు ప్రారంభిస్తాయి. కానీ రుణమాఫీ జరగకుంటే కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పులు తిరిగి చెల్లించాలని,  రె న్యువల్‌ చేసుకోవాలని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.  

‘‘బ్యాంకుల్లో రైతు రుణాలు ఉన్నవాళ్లు ఎవ్వరూ కట్టకండి.. మేం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం’’అప్పట్లో పలు ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 

ముందు చెల్లించండి.. తర్వాత సర్దుబాటు చేస్తాం
రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూ డు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా అవి చెల్లించలేదు.

ఈ నేపథ్యంలో బ్యాంకులు చెప్పిన ప్రకారం పాత అప్పులు చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేశాక సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. రుణాలు రెన్యువల్‌ చేసుకోకపోతే రైతులు డిఫాల్టర్లుగా మారిపోతారు. అయితే కొన్ని బ్యాంకులు రైతుబంధు సొమ్మును జమ చేసుకోవడం ద్వారా రెన్యువల్‌ చేయడం గమనార్హం.

కాగా తాము రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం సాధ్యం కాదని ఒక బ్యాంకు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. బకాయిలు పేరుకుపోతే ఎవరినైనా డిఫాల్టర్లుగా ప్రకటిస్తామని అన్నారు. లక్షలాది మంది రైతుల రుణ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, అందుకే నోటీసులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పాత రుణాన్ని అలాగే ఉంచి కొత్త రుణం ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు.  

Advertisement
Advertisement