Bhadrachalam: Officers Withdrawal Of Third Hazard Warning Over Floods - Sakshi
Sakshi News home page

భద్రాచలం వద్ద తగ్గిన వరద ఉధృతి

Published Mon, Jul 31 2023 4:32 AM

Bhadrachalam: Officers Withdrawal Of Third Hazard Warning Over Floods - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/భద్రాచలం/ధరూరు: పరీవా­హ­క ప్రాంతంలో వర్షాలు తెరిపినివ్వడంతో ఎగువ గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో మూడో ప్రమాద హెచ్చరికను రాష్ట్ర ప్రభు­త్వం ఉపసంహరించుకుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్దకు ప్రవాహం 12,79,307 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 56 అడుగుల నుంచి 50.4 అడుగులకు తగ్గింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగిపోవడంతో గోదావరిలో వరద తగ్గుతోంది.

మరోవైపు, శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 8,100 క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 44,354, పార్వతి బ్యారేజ్‌ వద్ద 30,150, సరస్వతి బ్యారేజ్‌ వద్ద 43,615 క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ నుంచి 5.71 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజ్‌ నుంచి 9.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. శ్రీరామ్‌ సాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి ప్రవాహం తక్కువగా ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద సోమవారం మరింతగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.  

జూరాలలో..: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు 1,58,655 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. 9 గంటల వరకు 37 వేలకు తగ్గడంతో 25 క్రస్టు గేట్లనూ మూసివేశారు. మళ్లీ రాత్రి 8 గంటలకు 68,500 క్యూసెక్కులకు వరద పెరగడంతో 6 గేట్లను తెరిచి 23,184 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల నుంచి విద్యుదుత్పత్తి, గేట్ల ద్వారా కలిపి 64,474 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 846.90 అడుగుల వద్ద 73.6744 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Advertisement
Advertisement