బడ్జెట్‌లో తప్పుడు లెక్కలు | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో తప్పుడు లెక్కలు

Published Tue, Mar 23 2021 4:57 AM

Bhatti Vikramarka Speech In Assembly Over Telangana Budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌ విషయంలో ప్రభుత్వ డొల్లతనాన్ని ప్రశ్నిస్తే సరైన సమాధానాలు చెప్పకపోగా సభను,  రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించేలా మంత్రులు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దుల లెక్కలపై మసిపూసి మారేడుకాయ చేసి అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌పై చర్చకు సమాధానాల అనంతరం సందేహాల నివృత్తిలో భాగంగా ఆయన మాట్లాడారు.  

ఆదాయం రూ. 1.20 లక్షల కోట్లు దాటదు.. 
కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ. 1.76 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో చెప్పారని, కానీ అది రూ. 1.20 లక్షల కోట్లకు మించదన్న విషయాన్ని గుర్తించాలని భట్టి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు సంబంధించిన సబ్‌ప్లాన్‌ కేటాయింపులను విద్యాశాఖ కేటాయింపులుగా చూపుతున్నారని, మళ్లీ సబ్‌ప్లాన్‌ చర్చ వస్తే ఆ మొత్తాన్ని సబ్‌ప్లాన్‌ ఖాతాలో చూపుతారని, అవే నిధులను అటూఇటూ చూపుతున్నారని విమర్శించారు. 

ప్రైవేటు వర్సిటీల కోసం సర్కారు కుట్ర.. 
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2 వేలకుపైగా ఖాళీలున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని భట్టి ప్రశ్నిం చారు. విద్యా వ్యవస్థకు తలమానికంగా ఉన్న ఉస్మా నియా యూనివర్సిటీయే ఇంత దుస్థితిలో ఉంటే ఇక ప్రభుత్వం విద్యా వ్యవస్థపై దృష్టి సారిస్తోందనే మాటలు ఎందుకని ప్రశ్నిం చారు. ప్రభుత్వ అధీనంలోని విద్యావ్యవస్థను టీఆర్‌ఎస్‌ సర్కారు సర్వనాశనం చేస్తోందని, పేద, మధ్యతరగతికి ఉపయోగపడే వర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు వర్సిటీల కోసం కుట్ర చేస్తోందని దుయ్య బట్టారు. విద్యారంగం అభివృద్ధికి బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని చెప్ప డం ఏమిటని నిలదీశారు. ఆర్టీఏ ద్వారా తెచ్చిన లెక్కలనే సభ ముందుంచుతున్నానని భట్టి పేర్కొన్నారు. 

భూముల అమ్మకంతో రూ. 16 వేల కోట్లు: హరీశ్‌
సభలో భట్టి విక్రమార్క చెప్పిన లెక్కలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. భట్టి తప్పుడు వివరాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతోనే బడ్జెట్‌ను రూపొందించిందని, ఆదాయం సమకూర్చుకొనే విషయంలో ప్రభుత్వ భూముల అమ్మకం కూడా ఉందన్నారు. ఈ రూపంలో రూ. 16 వేల కోట్లను సమకూర్చుకుంటామని, నిరర్థక ఆస్తుల జాబితాలో ఉన్న రాజీవ్‌ స్వగృహ ఇళ్లు, హౌసింగ్‌ బోర్డు భూములను అమ్మి ఆదాయం సమకూర్చుకుంటామన్నారు. మైనింగ్‌లో కొత్త పాలసీ తేనున్నామని, వేలం ద్వారా కేటాయించడం వల్ల పన్నేతర ఆదాయం సమకూర్చుకుంటామన్నారు. వాటితో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీలకు మంచి స్కూళ్లు పెట్టొద్దా? 
ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల విషయంలో భట్టి ఏవేవో మాట్లాడుతున్నారని, ఆ వర్గం పిల్లలకు మంచి పాఠశాలలు పెట్టొదంటారా? అని హరీశ్‌రావు ప్రశ్నిం చారు. ఎస్సీ సంక్షేమంపై చేసే కార్యక్రమాల్లో విద్యపై పెట్టే మొత్తాలను విద్యాశాఖకు పెట్టిన మొత్తంతో కలిపి చూసుకోవాలని సూచించారు. వాటిని కూడా విద్యపై పెడుతున్న ఖర్చుగానే పరిగణించాలన్నారు. 

కోర్టు స్టే వల్లే వర్సిటీల్లో నియామకాలకు బ్రేక్‌... 
ఉస్మానియా యూనివర్సిటీ సహా అన్ని యూనివర్సిటీల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చామని, అయితే ఇంటర్వూ్యలు పూర్తయ్యాక కొందరు కోర్టుకెక్కి స్టే తేవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో భర్తీ ప్రక్రియ నిలిచిపోయిందని, దాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కూడా చర్యలు తీసుకుంటోందన్నారు. అన్ని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పూచీకత్తులను అప్పుల్లో కలిపి చూపడం సరికాదని హరీశ్‌ పేర్కొన్నారు.  

Advertisement
Advertisement