ప్రీతిది ముమ్మాటికీ హత్యే  | Sakshi
Sakshi News home page

ప్రీతిది ముమ్మాటికీ హత్యే 

Published Mon, Mar 6 2023 2:16 AM

 BJP has demanded a judicial inquiry preeti death - Sakshi

కొడకండ్ల: పీజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతిది ముమ్మాటికీ  హత్యేనని, దీనిపై కుటుంబసభ్యులతోపాటు తమ పార్టీ ఆది నుంచి అనుమానం వ్యక్తం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపే వరకు తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిరి్నతండాలో ప్రీతి కుటుంబసభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం తప్పులేకపోతే ప్రీతి ఘటనపై ఎందుకు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ను కాపాడేందుకే ప్రభుత్వం డ్రామాలాడుతోందని, కేసును పక్కదారి పట్టించే యత్నం చేస్తోందని ఆరోపించారు.

ప్రీతి మతికి కారకులైన వారికి కఠినశిక్ష పడే వరకు ఆమె కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గిరిజన కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, కుటుంబసభ్యులను బెదిరించి మృతదేహాన్ని ఎత్తుకెళ్లే నీచానికి కేసీఆర్‌ ప్రభుత్వం దిగజారిందని దుయ్యబట్టారు. 

నేడు నిరసన దీక్ష.. 
మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు నిరసనగా సోమవారం హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు దీక్ష చేపడతానని బండి సంజయ్‌ వెల్లడించారు. కేసీఆర్‌ సర్కార్‌ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్‌ పాల్గొన్నారు.  

సంజయ్‌ను అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు 
ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్తున్న క్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు బండి సంజయ్‌ను అడ్డుకున్నారు. దీనిపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి బండి కాన్వాయ్‌ను పంపించారు. కాగా, ప్రీతి మృతికి సంతాపంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన కొవ్వొతుల ర్యాలీలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. 

పీఆర్‌సీ ఏర్పాటు చేయాలంటూ సీఎంకు లేఖ 
సాక్షి, హైదరాబాద్‌: వెంటనే వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జూలై 1 నుంచి పెంచిన జీతాలు చెల్లించాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. అలాగే బీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలైన రుణమాఫీ, ఉచిత యూరియా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూపంపిణీ వంటి వాటì అమలుకు రానున్న కేబినెట్‌ భేటీలో నిధులు కేటాయించాలన్నారు. 

Advertisement
Advertisement