బండి పాదయాత్రకు అనుమతివ్వాలి | Sakshi
Sakshi News home page

బండి పాదయాత్రకు అనుమతివ్వాలి

Published Wed, Aug 24 2022 1:52 AM

Bjp Requests Governor To Allow Bandi Sanjay Yatra Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించేందుకు అనుమతించడంతో పాటు, భద్రత కల్పించేలా రాష్ట్ర పోలీసు శాఖను ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను బీజేపీ నేతలు కోరారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది. బండి సంజయ్‌ అరెస్టు, యాత్ర అడ్డగింతకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. జనగాంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుట్రపన్ని, ప్రజా సంగ్రామ యాత్రపై చేసిన దాడి, హైదరాబాద్‌లో సోమవారం బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జరిపిన దాడిపైనా విచారణ జరిపించాలని కోరారు.

బండిసంజయ్‌ పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టేందుకు టీఆర్‌ఎస్‌ ఎంతగా ప్రయత్నించినా, బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించారని తెలిపారు. జనగాం జిల్లా దేవరుప్పలలో, గద్వాలలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడులు చేశారని వివరించారు. లిక్కర్‌ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ గూండాలు జరిపిన దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయని గవర్నర్‌కు తెలిపారు. ప్రజాసంగ్రామ యాత్రపై దాడి చేసేందుకు 4 నుంచి 5 వేల మందిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమీకరించినట్టు సమాచారం ఉందని, యాత్రకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. 

Advertisement
Advertisement