Sakshi News home page

అటెన్షన్‌ ఉంటే..టెన్షన్‌ ఎందుకు?

Published Sat, Dec 30 2023 3:58 AM

Board towards preparing the students of Inter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పరీక్షల ఫోబియాతోనే ఇంటర్‌లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సగానికి తగ్గుతోంది. హైటెన్షన్‌కు గురయ్యే విద్యార్థులు 36 శాతం ఉంటుండగా, పరీక్షల షెడ్యూల్‌ వచ్చాక టెన్షన్‌కు లోనయ్యేవారు 23 శాతం మంది ఉంటున్నారు. దీనికి సంబంధించి వైద్య, విద్యాశాఖలు రెండేళ్ల అధ్యయనం చేశాయి. మొదటి పరీక్ష కాస్త కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది.

రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం ఫస్టియర్‌ పరీక్షలు 4.09 లక్షల మంది రాస్తున్నారు. సెకండియర్‌ పరీక్షలు 3.82 లక్షల మంది వరకూ రాస్తున్నారు. వీరిలో సగటున 40 శాతం మంది ఫెయిల్‌ అవుతున్నారు. దీంతో పరీక్షలు రాసే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థుల టెన్షన్‌ దూరం చేసేందుకు ఇంటర్‌ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. 

ప్రిపరేషన్‌కు ఇదే అదును
రెండు నెలల ముందు నుంచే పరీక్షలకు సన్నద్ధమైతే విద్యార్థుల్లో టెన్షన్‌ ఉండదని ఇంటర్‌ అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలనుకుంటున్నారు. ముందుగా విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తారు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్‌ ఇస్తారు. అవసరమైతే కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై లెక్చరర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

ఇందులోనూ విద్యార్థి వెనుకబడి ఉన్న సబ్జెక్టులు, పాఠ్యాంశాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రిన్సిపల్స్‌కు ఇస్తారు.  మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ఈ 60 రోజులూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో టెన్షన్‌ దూరం చేయడం తేలికని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పరీక్షల టైంటేబుల్‌ను బోర్డు విడుదల చేసింది. త్వరలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకునే చర్యలపైనా జిల్లా ఇంటర్‌ అధికారులు టైం టేబుల్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 

ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి
సిలబస్‌ సకాలంలో పూర్తికాకపోవడం కూడా విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్‌కు ఓ కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతుందని అధ్యయన నివేదికల సారాంశం. ఫెయిల్‌ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు.

దీనిని పరిగణనలోనికి తీసుకొని కొన్ని జిల్లాలపై ఇంటర్‌ అధికారులు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు కనబరుస్తున్న జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్‌ వంటి  జిల్లాలున్నాయి. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

కొన్ని ముఖ్యాంశాలు...
♦ ప్రతీ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఇంటర్‌ విద్యార్థులు – 7 లక్షలకుపైగా
♦ ఫెయిల్‌ అవుతున్న వారు – 2.5 లక్షల మంది
♦ పరీక్షల ఫోబియా వెంటాడుతున్న విద్యార్థులు – 1.02 లక్షల మంది
♦ పరీక్ష షెడ్యూల్‌ ఇవ్వగానే భయపడే వారు – 28 వేల మంది
♦  సిలబస్‌పై టెన్షన్‌ పడుతున్న విద్యార్థులు – 51 వేల మంది

మానసిక ధైర్యం నింపాలి 
ఈ 60 రోజులూ లెక్చ రర్లది కీలకపాత్ర. పరీక్షల భయం ఉన్న వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. వెనుకబడ్డ సబ్జెక్టులపై రివిజన్‌ చేయించడం ఒక భాగమైతే, వీలైనంత వరకూ పరీక్ష తేలికగా ఉంటుందనే భావన ఏర్పడేలా చూడాలి. దీనివల్ల ఎగ్జామ్‌ ఫోబియా తగ్గుతుంది.  – మాచర్ల రామకృష్ణ గౌడ్, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

తల్లిదండ్రులదీ కీలకపాత్రే  
పరీక్షల భయం వెంటాడే విద్యార్థి సైకాలజీని బట్టి అధ్యాపకులు వ్యవహ రించాలి. వారిని  ప్రణాళిక బద్ధంగా చదివించే విధా నం అనుసరించాలి. సాధ్యమైనంత వరకూ పరీక్ష వెంటాడుతోందన్న భావనకు దూరం చేయాలి. చదివే ప్రతీ అంశం గుర్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా జాగ్రత్త పడాలి. పరీక్షల పట్ల భయం అనిపిస్తే నిపుణుల చేత కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.   –  రావులపాటి సతీష్‌బాబు, మానసిక వైద్య నిపుణుడు

స్టడీ అవర్స్‌ పెడుతున్నాం

విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేందుకు 60 రోజుల పాటు ప్రత్యేక కార్య క్రమాలు చేపడుతున్నాం. వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, స్పెషల్‌ క్లాసులు నిర్వహించమని ఆదేశాలిచ్చాం. టెన్షన్‌ పడే విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వమని ప్రిన్పిపల్స్‌కు చెప్పాం. అవసరమైతే టెలీ కౌన్సిలింగ్‌ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. – జయప్రదాబాయ్,ఇంటర్‌ పరీక్షల విభాగం అధికారిణి

Advertisement
Advertisement