Telangana: మూడు నెలలుగా పాలు లేవ్‌.. | Sakshi
Sakshi News home page

Telangana: మూడు నెలలుగా పాలు లేవ్‌..

Published Thu, Jan 5 2023 3:07 AM

Cant Supply Milk To Anganwadi Centers In Telangana - Sakshi

వికారాబాద్‌లోని గరీబ్‌నగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న చిన్నారులు వీరు. ఇక్కడ రెండున్నర నెలలుగా చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు పాలు ఇవ్వడం లేదు. ఇదేమిటని అడిగితే పాలు అసలే రావడం లేదని నిర్వాహకులు చెప్తున్నారని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీల్లో పంపిణీ చేసే పౌష్టికాహారం సరఫరాపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ చేతులెత్తేసింది. దాదాపు మూడు నెలలుగా ఈ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు అందడం లేదు. అంగన్‌వాడీల్లో నమోదైన చిన్నారులకు రోజుకు 100 మిల్లీలీటర్లు.. గర్భిణులు, బాలింతలకు రోజుకు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు సరఫరా చేయాల్సి ఉంది.

వీటిని టెట్రా ప్యాకెట్ల రూపంలో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌ నెలాఖరుతో అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా కాంట్రాక్టు ముగిసింది. ఇప్పటివరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్త కాంట్రాక్టరు ఎంపిక టెండరు ఖరారు చేయలేదు. కనీసం పాత కాంట్రాక్టర్‌కే తాత్కాలికంగా పాల పంపిణీ బాధ్యతలనూ అప్పగించలేదు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు పాలు అందించడం లేదేమిటంటూ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను నిలదీస్తున్నారు.

పాల బడ్జెట్‌ ఏటా రూ.100 కోట్లు
పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాల పంపిణీ కోసం ఏటా దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతినెలా సగటున 18.5 లక్షల లీటర్ల పాలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారు.

ఒక్కో లీటరు పాలకు సగటున రూ.43, ప్యాకింగ్, రవాణా చార్జీ కింద మరో రూ.9 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తోంది. ఇంత కీలకమైన, ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాల్సిన రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ నిర్లక్ష్యంతో పాల పంపిణీ నిలిచిపోయింది.

మూడు నెలలుగా అందక..
కాంట్రాక్టు గడువు ముగిసే క్రమంలో సదరు సంస్థ అన్ని కేంద్రాలకు పాలు పంపిణీ చేసి ఆపేసింది. ఆ స్టాకు అందుబాటులో ఉన్నంత వరకు దాదాపు అక్టోబర్‌ రెండో వారం వరకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు పాల ప్యాకెట్లను లబ్ధిదారులకు సర్దుబాటు చేశారు. తర్వాత పంపిణీ నిలిచిపోయింది. 3 నెలలుగా పాలు అందకపోవడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో కాంట్రాక్టరే పాలు సరఫరా చేయడం లేదంటూ లబ్ధిదారులకు చెప్తున్నట్టు తెలిసింది. దీనిపై అధికారులను అడిగితే.. త్వరలో టెండర్లు ఖరారవుతాయని, పాల పంపిణీ మొదలవుతుందని చెప్తుండటం గమనార్హం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement