Viveka Murder Case: CBI Over Action On YS Avinash Reddy - Sakshi
Sakshi News home page

అవినాశ్‌ అరెస్టుకు సీబీఐ అత్యుత్సాహం

Published Fri, Apr 28 2023 3:59 AM

CBI Over Action On YS Avinash Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కిరాయి హంతకుడు బయట తిరిగేందుకు పూర్తిగా సహ­కరిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయడానికి అత్యు­త్సాహం ప్రదర్శిస్తోందని అతని తరఫు సీనియర్‌ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదించారు.

అవినాశ్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దర్యాప్తు చేస్తోంది తప్ప.. ఇతర కీలక అంశాలను పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్‌ వివేకా హత్య కేసును సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సురేందర్‌ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేశారు.
 
‘హియర్‌ సే ఎవిడెన్స్‌’ ఆమోదం కాదు.. 
నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సీబీఐ ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావిస్తూ అవినాశ్‌ను అరెస్టుచేయాలని చూస్తోంది. కానీ, అందులో ఏ ఒక్క దానికీ ఆధారాల్లేవు. అన్నీ ఊహాజనితాలు, కల్పితాలే. ఏ–4 నిందితుడు దస్తగిరి వాంగ్మూలం, గూగుల్‌ టేక్‌అవుట్, ఎమ్మెల్సీ ఎన్నికల కారణం, సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు చేస్తోంది. ఇందులో ఏ ఒక్కటీ చట్టప్రకారం సరికాదు. మన వెనుక వైఎస్‌ అవినాశ్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలాన్ని ఇచ్చాడు.

అయితే, ఈ వ్యాఖ్యలను గంగిరెడ్డి తన వాంగ్మూలంలో ఖండించాడు. తను ఎవరి పేరు చెప్పలేదని వెల్లడించాడు. అంతేకాక.. దస్తగిరి రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చాడు. మొదటిసారి చెప్పిన దాంట్లో ఎవరి పేరూలేదు. రెండోసారి చెప్పిన దాంట్లో ఈ పేర్లు చెప్పాడు. ఇలా ఎందుకు చెప్పాడని సీబీఐ దర్యాప్తు చేయడంలేదు. అతన్ని ప్రశ్నించడంలేదు. ‘హియర్‌ సే ఎవిడెన్స్‌’ అంటే.. ఎవరో చెప్పింది విని చెప్పడం. ఇది చట్టప్రకారం ఆమోదయోగ్యం కాదు. అంతేకాదు.. కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి బదిలీ చేసిన తర్వాత దస్తగిరి దాదాపు రెండునెలలు ఢిల్లీలో ఉండి వచ్చాడు.

తాను సీబీఐ వారిని కలిసివచ్చానని కూడా బయట చెప్పాడు. అక్కడ జరిగిన ఒప్పందంలో భాగంగానే ఈ పేర్లు ప్రస్తావించాడు. తానే హత్యచేశానని చెప్పిన కిరాయి హంతకుడికి బెయిల్‌ ఇచ్చేందుకు సీబీఐ సహకరించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాగే, గూగుల్‌ టేక్‌అవుట్‌ ప్రామాణికం కాదు. ఒక వ్యక్తి తన స్నేహితుడి ఫోన్‌లోని గూగుల్‌ను అతని జీమెయిల్‌తో తెరిస్తే.. స్నేహితుడు ఎక్కడికి వెళ్లినా ఇతను అక్కడ ఉన్నట్లే చూపిస్తుంది.

అందుకే గూగుల్‌ టేక్‌అవుట్‌ను గూగుల్‌ కూడా సర్టిఫై చేస్తూ లేఖ ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని సర్టిఫై చేయదు. దస్తగిరి చెప్పిన వాంగ్మూలానికి, గూగుల్‌ టేక్‌అవుట్‌ సమాచారానికి వివరాల్లో తేడా ఉంది. ఇందులో ఏదీ సరైందో సీబీఐ ఎలా నిర్ణయించుకుంది,, ఎలా చెబుతుంది?’.. అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల వివాదానికీ సాక్ష్యాల్లేవు..
ఇక వివేకా.. అవినాశ్‌కు బాబాయి. అవినాశ్‌ ఎంపీగా పోటీచేసినప్పుడు అతని ప్రచారంలో, గెలుపులో వివేకా కీలకపాత్ర పోషించారు. తర్వాత జరగబోయే ఎన్నికల్లో కూడా అవినాశ్‌ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనడానికి ఆయన సిద్ధమై ఉన్నారు. ఇదే విషయాన్ని వివేకా మృతిచెందిన దాదాపు 10 రోజుల తర్వాత ఆయన కుమార్తె సునీత కూడా మీడియాకు వెల్లడించింది. తర్వాత ఏం జరిగిందో.. మాట మార్చారు.

ఇక సాక్షాలను మార్చడం విషయానికొస్తే.. మార్చి 15, 2019 ఉదయం అవినాశ్‌రెడ్డి జమ్మలమడుగు బయల్దేరారు. మధ్యలో ఉండగా వివేకా అల్లుడు ఫోన్‌చేసి, గుండెపోటుతో మృతిచెందినట్లు చెప్పారు. దీంతో ఆయన ఉ.6 తర్వాత అక్కడికి చేరుకున్నారు. కొంత సమయం అక్కడి ఉండి వెళ్లిపోయారు తప్ప.. సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేయలేదు. ఇది కూడా కల్పితమే. అవినాశ్, భాస్కర్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకునే సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది.

వివేకా రాసిన లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచాల్సి వచ్చిందో చెప్పమని అతని అల్లుడిని సీబీఐ కనీసం ప్రశ్నించలేదు. సీబీఐ దర్యాప్తు చేపట్టిన నాటి నుంచి పిలిచిన ప్రతీసారి అవినాశ్‌ విచారణకు హాజరవుతున్నారు. ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అర్టికల్‌–21ను ఉల్లంఘిస్తూ.. అవినాశ్‌ ప్రాథమిక హక్కును కాలరాస్తున్నారు. సీబీఐ కోరిన రోజున.. ఉదయం నుంచి సాయంత్రం వరకు (కస్టడీ) విచారణకు హాజరుకావడానికి అవినాశ్‌ సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలి’ అని నిరంజన్‌రెడ్డి న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

అవినాశ్‌పై ఎలాంటి కేసుల్లేవు
అనంతరం, సునీత తరఫు న్యాయవాది సిద్దార్థ లూద్రా వాదనలు వినిపిస్తూ.. అవినాశ్‌పై పలు కేసులు ఉన్నాయని, ఎన్నికల అఫిడవిట్‌లో అతను పేర్కొన్నారని చెప్పారు. దీనిపై నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుని.. అవినాశ్‌పై ఎలాంటి కేసుల్లేవని, తాజాగా సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకున్న డాక్యుమెంట్లను కోర్టుకు చూపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement