Sakshi News home page

సీసీ కెమెరాలు తిప్పేస్తున్నారు! 

Published Wed, Aug 23 2023 1:13 AM

CCTV cameras for the safety of passengers in RTC buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోణంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లను భయపెడుతున్నాయి. తమపై నిఘా కోసమే వాటిని ఏర్పాటు చేశారన్న అపోహలో ఉన్న డ్రైవర్లు గుట్టు చప్పుడు కాకుండా కెమెరాలను ఓ పక్కకు తిప్పేస్తున్నారు.

దీంతో బస్సులోపల ప్రయాణికులు ఉండే భాగం కాకుండా, బస్సు గోడలు, కిటికీల ప్రాంతం కెమెరాల్లో రికార్డు అవుతోంది. తాజాగా బస్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అలాంటి డ్రైవర్లకు సీసీ కెమెరాలపై అపోహలు తొలగిపోయేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.  

చర్యలు తీసుకుంటారన్న భయంతో..: ఇటీవలే ఆర్టీసీ దాదాపు 700 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను సమకూర్చుకుంది. ఇప్పటి వరకు కొన్ని ఏసీ బస్సుల్లో తప్ప మిగతా ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు లేవు. బస్సులో ఏ ఘటన జరిగినా స్పష్టంగా తెలుసుకునే వీలు లేకుండా పోతోంది. దీంతో ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని భావించి, కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయిస్తున్నారు. ఇలా కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను కంపెనీ నుంచి వచ్చినవి వచ్చినట్టు రోడ్డెక్కిస్తున్నారు.

ఆ బస్సుల్లో లోపల డ్రైవర్‌ క్యాబిన్‌ ఎదురుగా ఒక కెమెరా, డ్రైవర్‌ క్యాబిన్‌ వెనక మరో కెమెరా ప్రయాణికులు కనిపించేలా ఉంటాయి. మరో కెమెరా బస్సు వెనక రివర్స్‌ చేసేప్పుడు డ్రైవర్‌కు సౌలభ్యం కలిగించేలా ఉంటుంది. అయితే ఇప్పుడు క్యాబిన్‌ ముందువైపు ఉన్న కెమెరాను చూడగానే డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సస్పెన్షన్‌ వేటు పడుతుండటమే దీనికి కారణం. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్‌ వినియోగం సాధారణ విషయంగా మారింది.

ఇంటి నుంచి కాల్‌ వచ్చినా, అత్యవసర పనులకు సంబంధించి ఫోన్‌ కాల్‌వచ్చినా డ్రైవర్లు మాట్లాడేస్తుంటారు. అయితే బస్సు నడిపే సమయంలో డ్రైవర్లు సెల్‌ ఫోన్‌ మాట్లాడటాన్ని నేరంగా పరిగణిస్తారు. అలాగే కొందరిలో డ్రైవింగ్‌లో అప్పుడప్పుడు ఏమరపాటు వ్యక్తమవుతుంటుంది. ఇలాంటివన్నీ సీసీ కెమెరాలో రికార్డు అవుతాయి. ఇది తమపై చర్యలకు కారణమవుతుందేమోనన్నది డ్రైవర్ల భయానికి కారణంగా ఉంటోందని అధికారులంటున్నారు.  

దూర ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు సంకటం.. 
దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అడ్వాన్సు టికెట్‌ బుకింగ్‌ సమయంలో డ్రైవర్‌ ఫోన్‌ నంబర్‌ను కూడా తెలియజేస్తారు. ప్రయాణికులు ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి బస్సు ఎక్కడి వరకు వచ్చిందో వాకబు చేస్తుంటారు. కాగా, విశాఖపట్నం, బెంగళూరు లాంటి దూర ప్రాంతాల సర్విసులు మినహా మిగతా బస్సుల్లో ఒకే డ్రైవర్‌ ఉంటున్నాడు. ప్రయాణికుల నుంచి ఫోన్‌ కాల్‌ వస్తే అతనే మాట్లాడాల్సి వస్తోంది.

ఇది రికార్డయితే, దానిని కూడా నేరంగా పరిగణిస్తారన్న భయం డ్రైవర్లలో ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బస్సులో కెమెరా యాంగిల్‌ను తిప్పేస్తున్నారన్నది అధికారుల మాట. దీంతో డ్రైవర్లలో అపోహలు తొలగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ కెమెరాలు ప్రయాణికుల భద్రత కోసమే కేటాయించాన్న విషయాన్ని తెలిపి, వారిలో ఆందోళన పోగొట్టాలని అధికారులు నిర్ణయించారు.  

Advertisement
Advertisement