Sakshi News home page

గద్దర్‌ స్థాపించిన స్కూల్‌లోనే ఆయన అంత్యక్రియలు.. అప్‌డేట్స్‌

Published Sun, Aug 6 2023 5:03 PM

Celebrities Paying Tributes To Gaddar Live Updates - Sakshi

Updates..

గద్దర్‌ మృతి పట్ల ఆయన భార్య విమల బోరున విలపించారు.

► రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్‌ అంతిమయాత్ర కొనసాగనుంది. మహాబోధి విద్యాలయంలో రేపు గద్దర్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. 

► అల్వాల్‌లో గద్దర్‌ స్థాపించిన స్కూల్‌ గద్దర్‌ అంత్యక్రియలు. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్‌ భార్య విమల సూచించారు. 

► గద్దర్‌ మృతిపట్ల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కాలికి గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. తన పాటలతో కోట్లాది మంది హృదయాలను ఉత్తేజపరిచిన గద్దర్‌ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు.

► గద్దర్‌ మృతి బాధాకరం: ప్రియాంక గాంధీ. గద్దర్‌ మృతికి ప్రియాంక గాంధీ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన మృతి చాలా బాధాకరం అని ట్వీట్‌ చేశారు.

ప్రజా యుద్ధనౌక అందించిన స్ఫూర్తి చరిత్ర మరవదని డైరెక్టర్‌ ఎన్‌. శంకర్‌ అన్నారు. గద్దర్‌ మృతికి దర్శకుడు ఎన్‌. శంకర్‌ సంతాపం తెలిపారు. ‘పల్లె పాట మీద ప్రేమ ప్రేమపెంచుకుని, జనం పాటను గుండెకు హత్తుకుని, పోరుపాటను ఎగిరే ఎర్రజెండా కు అద్దిన, ప్రజల గుండె గొంతుక ప్రజా యుద్ధనౌక అందించిన స్ఫూర్తి చరిత్ర మరవదు.. గద్దరన్న ఏ లోకంలో వున్నా.. అన్న పాట అన్ని కాలాల్లో వినిపిస్తూనే ఉంటుంది.. జోహార్ గద్దరన్న’ అని యన్. శంకర్ చెప్పారు.

► గద్దర్‌ మృతి పట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్‌ సంతాపం తెలిపారు. గద్దర్‌ మరణం బాధాకరం. ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్‌ నిలిచారు. తెలంగాణ గొప్ప ప్రజాకవిని కోల్పోయింది. గద్దర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. తన జీవితాన్ని గద్దర్‌ ప్రజలకే అంకితం చేశారు. తన ఆటపాటలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు. 

► గద్దర్‌ పార్ధీవదేహం ఉన్న ఎల్బీ స్టేడియం వద్దకు హరగోపాల్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దర్‌ జ్ఞాపకాలు మరిచిపోలేం. విప్లవ ఉద్యమానికి గద్దరే స్ఫూర్తి. బలహీనవర్గాల పీడిత ప్రజల కోసం పోరాడిన వ్యక్తి గద్దర్‌. 

► గద్దర్‌ మృతిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. గద్దర్‌ మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. గద్దర్‌ తన గళంతో కోట్లాది మందిని ఉత్తేజపరిచారు. గద్దర్‌ మరణం తీరని లోటు. గద్దర్‌ లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. తెలంగాణ ఉద్యమంలో మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చారు. ప్రజల్లో జానపదం ఉన్నంత కాలం గద్దర్‌ పేరు నిలిచిపోతుంది. 

► అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మాట్లాడుతూ.. మెతుకు సీమ ముద్దు బిడ్డ నేలకొరిగారు. నమ్మిన సిద్దాంతం కోసం నాలుగు దశాబ్దాలు పోరాడారు. మా ఉమ్మడి మెదక్ జిల్లాకు తీరని లోటు. గద్దర్ పాటలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేశాయి. 

► గద్దర్‌ మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. 

► ఎల్బీ స్టేడియానికి గద్దర్‌ పార్థివదేహం తరలింపు. ప్రజల సందర్శనార్థం గద్దర్‌ పార్థివదేహన్ని అక్కడికి తరలించారు. గేట్‌ నెంబర్‌-6 వద్ద పార్ధివదేహన్ని ఉంచారు. గద్ధర్‌ పార్థివదేహం వెంట విమలక్క, సీతక్క, రేవంత్‌ రెడ్డి, వీహెచ్‌ ఉ‍న్నారు. 

► కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గద్దరన్న మృతి వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. ఉద్యమ నాయుకులు ఎక్కడి నుంచి వచ్చినా వారు ఏ పార్టీలో ఉన్నా ఆ భావం ఉంటుంది. ప్రజా సమస్యల పోరాడిన వ్యక్తి ఇలా కన్నుమూయడం చాలా బాధాకరం. గద్దరన్న భార్య కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమెకు ఇప్పుడు మనమందరం బాసటగా ఉండాలి. 

► కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు సంతాపం తెలిపారు. గద్దర్‌ మృతి చాలా బాధాకరం. ప్రజా గొంతుక మూగబోయింది. 

►  గద్దర్‌ మృతిపై నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

► గద్దర్‌ మృతిపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం. 

 గద్దర్‌ మృతిపై గవర్నర్‌ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు.  భారతీయ కవి, విప్లవ వీరుడు, ఉద్యమకారుడు గద్దర్ @గుమ్మడి విట్టల్ రావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతితో తెలంగాణ రాష్ట్రం తన అద్భుతమైన కవితా శైలితో, నాయకత్వ పటిమతో చెరగని ముద్ర వేసిన ఒక ప్రముఖ కవిని, ఉద్యమకారుడిని కోల్పోయిందని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ సమయంలో, ప్రజాయుద్ధనాయకుడిగా రాజకీయాలలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయం. మృతుల కుటుంబ సభ్యులకు, అనుచరులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

► మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపైన మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గద్దర్. కోట్లాది మందిని ఆకర్షించిన కంఠం మూగబోవడం మనస్తాపాన్ని కలిగించింది. సిద్ధాంత పరమైన వైరుద్యం ఉన్నప్పటికి ప్రజా సమస్యల కోసం వారు ఎంతో మంది నాయకులను కలవడం జరిగింది. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని  తెలుపుతూ, వారు మనోధైర్యంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.

► తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా యుద్ధ నౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్న విప్లవ గాయకుడు గద్దర్ కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన గద్దర్.. తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటతో, తన మాటతో.. సరికొత్త ఊపును తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయాల వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడిన సమయంలో.. ‘పొడుస్తున్న పొద్దమీద నడుస్తున్న కాలమా!’ అన్న గద్దర్ పాట ఓ సంచలనం.

తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో చాలా సందర్భాల్లో వేదిక పంచుకునే అవకాశం లభించింది. రాష్ట్ర సాధనకు సంబంధించిన ఎన్నో అంశాలను పరస్పరం పంచుకునే అవకాశం కూడా దొరికింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2012లో నేను చేపట్టిన ‘తెలంగాణ పోరుయాత్ర’ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో గద్దర్ నాతో కలిసి నడిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 
 

► గద్దర్‌ మృతిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా.. తెలంగాణ ఉద్యమనేత గద్దర్‌ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమే అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసేలా చేసింది. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తిదాయకంగా కొనసాగాలి అని కామెంట్స్‌ చేశారు. 

అమీర్‌పేట్‌ ఆసుపత్రి నుంచి అల్వాల్‌లోని భూదేవీనగర్‌కు గద్దర్‌ పార్థీవదేహాన్ని తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, కళాకారులు అపోలో ఆసుపత్రి వద్ద గుమ్మిగూడారు. 

అపోలో ఆసుపత్రికి చేరుకున్న టీపీసీపీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. 

► గద్దర్‌ మృతిపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. ఉద్యమ గళం మూగబోయింది. ప్రజా యుద్ధ నౌక కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌ పాత్ర కీలకం. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి. ప్రజా సమస్యలపై గద్దర్‌ పోరాటం అజరామరం. తనదైన పాటలతో ఎంతో మందిని ఉత్తేజపరిచారు. అనేక పాటలతో ఆనాడు ఉద్యమానికి ఊపు తెచ్చారు. ఆయనకు నివాళులు. 

► గద్దర్‌ మృతి నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వద్ద అరుణోదయ ఉద్యమకారణి విమలక్క కంటతడిపెట్టారు. అనంతరం విమలక్క మీడియాతో  మాట్లాడుతూ.. కామ్రేడ్‌ గద్దరన్నకు రెండు రాష్ట్రాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుండి వినమ్రంగా విప్లవ జోహార్లు. తాను బ్రతికనంత కాలం గద్దరన్న ప్రజల పాటగా నిలబడ్డాడు. గద్దరన్న ఒక లెజెండ్‌. ప్రజల పాట గద్దరన్న. ప్రజల ఆట, మాట గద్దరన్న. అమరుల కుటుంబాలకు గద్దరన్న అండగా నిలబడ్డారు. గద్దరన్నను ఇలా బెడ్‌ మీద చూస్తానని అనుకోలేదు. ఆయన కుటుంబాకు ప్రగాఢ సానుభూతి. జోహార్‌ గద్దరన్న అని అన్నారు. 

► గద్దర్‌ మరణించడానికి గల కారణాలపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గద్దర్ మృతికి గల ప్రధాన కారణాలను వెల్లడించారు.  ప్రధానంగా ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలతోనే గద్దర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. జూలై 20న తీవ్రమైన గుండెజబ్బుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు.. ఆగస్టు 3వ తేదీన బైపాస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆయనకు గతంలో ఉన్న ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో కోలుకోలేక మృతి చెందారని బులెటిన్‌లో వైద్యులు ప్రకటించారు.

► గద్దర్‌ మృతిపై నటుడు ఆర్‌. నారాయణ మూర్తి స్పందించారు. 

‘ఒక అన్నమయ్య పుట్టారు.. దివంగతులయ్యారు

ఒక రామదాసు పుట్టారు.. దివంగతులయ్యారు

ఒక పాల్ రబ్సన్ పుట్టారు.. దివంగతులయ్యారు

ఒక గద్దర్ పుట్టారు.. డివంగతులయ్యారు

ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది’ అని అన్నారు. 

► గద్దర్‌ మృతి నేపథ్యంలో విమలక్క, వీహెచ్‌ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే, పలువురు రచయితలు, కళాకారులు కూడా అపోలోకు తరలివెళ్లారు. గద్దర్‌ లేరన్న వార్త తమను షాక్‌కు గురిచేసిందని రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

► సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్‌ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్‌ కన్నుమూశారు. అయితే, గద్దర్‌ ఇటీవలే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే గద్దర్‌ తుదిశ్వాస విడిచారు. ఇక, గద్దర్‌ మృతిపై పలువరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement