Telangana: నలుదిశలా రోడ్ల విస్తరణ.. | Sakshi
Sakshi News home page

Telangana: నలుదిశలా రోడ్ల విస్తరణ..

Published Tue, Jun 1 2021 3:31 AM

Center Announces Huge Amount For Roads In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారుల విషయంలో కాస్త వెనుకబడి ఉన్న తెలంగాణ రోడ్‌ నెట్‌వర్క్‌ రూపురేఖలు మారేలా కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. గతంలో పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను అంగీకరిస్తూ కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసిన కేంద్రం.. ఇప్పుడు వాటిని సాకారం చేసేందుకు వీలుగా నిధులను కేటాయించింది. ఇటు జాతీయ రహదారుల విభాగం (ఎన్‌హెచ్‌), అటు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ద్వారా 1,272 కి.మీ. జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు ఏకంగా రూ.18,492 కోట్లను కేటాయిస్తూ కొత్త జాతీయ రహదారుల వార్షిక ప్రణాళికను ప్రకటించింది.

దీంతో ఇప్పటికే జాతీయ రహదారులుగా గుర్తింపు పొంది, పనుల కోసం వేచి చూస్తున్న రోడ్ల రూపురేఖలు మారబోతున్నాయి. ఇందులో గతంలో రాష్ట్ర రహదారులుగా ఉండి, కేవలం ఏడు మీటర్లు, అంతకంటే తక్కువ వెడల్పు ఉన్న రోడ్లను 10 మీటర్లకు విస్తరిస్తారు. జాతీయ రహదారిగా మారాలంటే ఆ రోడ్డు కనీసం పది మీటర్ల వెడల్పుతో ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న జాతీయ రహదారుల విభాగం చేపట్టే 787 కి.మీ. రోడ్లు పది మీటర్లకు విస్తరిస్తారు. మొత్తం 18 రోడ్లకు సంబంధించి రూ.6,962 కోట్లు ఖర్చు చేస్తారు. ఇక కేంద్రప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టే 485 కి.మీ. రోడ్లను నాలుగు వరసలుగా విస్తరిస్తారు. ఇవి జాతీయ రహదారుల హోదాలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం అవి రెండు వరసలుగా మాత్రమే ఉన్నాయి. ఇది పెద్ద పని అయినందున వీటికి రూ.11,530 కోట్లు ఖర్చు కానున్నాయి.  

ఇప్పుడు జాతీయ సగటును మించి.. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి స్థానికంగా జాతీయ రహదారుల నిడివి చాలా తక్కువగా ఉండేది. మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా ప్రకారం లెక్కిస్తే, దక్షిణ భారత్‌లోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ వెనుకబడి ఉండేది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించి వేగంగా జాతీయ రహదారులను మంజూరు చేయటంతో పాటు భారీగా నిధులు కేటాయించటంతో గత ఏడేళ్లలో పనులు మెరుగ్గా జరిగాయి. ఫలితంగా ప్రస్తుతం ప్రతి వంద చ.కి.మీ. నిడివిలో జాతీయ రహదారుల వాటా 4.2 కి.మీ.కు చేరుకుంది.

ఇది జాతీయ సగటు 3.8 కంటే ఎక్కువ కావటం విశేషం. ఇప్పుడు అభివద్ధి చేయబోయే రోడ్లు కూడా ఇందులో కలిసే ఉన్నాయి. కేంద్రం కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారుల అనుసంధానంలో భాగంగా చేపట్టిన భారత్‌మాలా ప్రాజెక్టు కింద ఎన్‌హెచ్‌ఏఐ పనులు చేపట్టనుంది. భూసేకరణ ఎంత వేగంగా జరిగితే, రోడ్లను నాలుగు వరసలుగా అభివృద్ధి చేసే పని అంత వేగంగా జరగనుంది. ఇక రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల విభాగం చేపట్టే పనులకు పెద్దగా భూసేకరణ అవసరం లేదు.   

Advertisement
Advertisement