అడవి తల్లిని వీడం.. బయటకెళ్లి బతకలేం | Sakshi
Sakshi News home page

అడవి తల్లిని వీడం.. బయటకెళ్లి బతకలేం

Published Mon, Apr 8 2024 7:52 AM

Chenchus Leaves In Nagarkurnool Forest  - Sakshi

నల్లమల నుంచి సార్లపల్లి వాసుల రీలొకేషన్‌కు సర్వం సిద్ధం 


ఎనీ్టసీఏ ద్వారాప్రత్యేక ప్యాకేజీకి సన్నాహాలు 


 తరలింపు స్వచ్ఛందమే అంటున్న అటవీ అధికారులు 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: అడవి నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు చెంచులు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకుని జీవిస్తున్న తాము బయటకు వెళ్లి బతకలేమని, తాము అడవిలోనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. అడవుల్లో పులులకు ఆటంకం లేకుండా జనసంచారాన్ని తగ్గించడంతోపాటు మానవులకు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే పేరిట నట్టడవిలోని చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీ అధికారులు నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో ఉన్న సార్లపల్లి చెంచుపెంట వాసులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ జిల్లా డిస్ట్రిక్ట్‌ లెవల్‌ కమిటీ నుంచి రీలొకేషన్‌కు అనుమతి రావడంతో ఈ నెల 5న గ్రామస్తుల నుంచి ఒప్పందాలపై సంతకాల సేకరణ ప్రారంభించింది. రీలొకేషన్‌లో భాగంగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్, నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ, లబ్ధిదారుల మధ్య ఎంఓయూ కోసం అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో 2–3 నెలల్లోనే సార్లపల్లి వాసుల రీలొకేషన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సార్లపల్లి తర్వాత విడతల వారీగా కుడిచింతలబైల్, కొల్లంపెంట, కొమ్మెనపెంట వాసులను సైతం అడవి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలను చెంచులు వ్యతిరేకిస్తున్నారు. తమను అడవి బయటకు తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.  


మల్లాపూర్‌ పెంటలోని చెంచుల ఆవాసాలు 

ఎనీ్టసీఏ ద్వారా పునరావాస ప్యాకేజీ.. అయినా చెంచులు విముఖం 
అడవి లోపల నివసిస్తున్న వారిని బయటకు తరలిస్తే ఒక్కో కుటుంబానికి ఎన్టీసీఏ ద్వారా రూ.15 లక్షల పునరావాస ప్యాకేజీ అందించనుంది. వీరి పునరావాసం కోసం నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద అటవీశాఖకు చెందిన స్థలాన్ని కేటాయించారు. రూ.15 లక్షల ప్యాకేజీ వద్దనుకుంటే బాచారం వద్ద 220 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం, జీవనోపాధి కోసం 5 ఎకరాల వ్యవసాయ భూమిని అందజేస్తారు. సార్లపల్లిలో 269 కుటుంబాలు ఉండగా, వాటిలో 83 కుటుంబాలే చెంచులు. మిగతా కుటుంబాల్లో ఇతర వర్గాల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఎనీ్టసీఏ ప్యాకేజీకి ఇప్పటివరకు 186 కుటుంబాలు ఒప్పుకోగా వాటిలో చెంచు కుటుంబాలు ఆరే ఉన్నాయి. అడవి నుంచి బయటకు తరలింపునకు మెజార్టీ శాతం చెంచు కుటుంబాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. 

కనీస సౌకర్యాలకు దూరం..  
నల్లమల అటవీప్రాంతంలో మొత్తం 88 ఆవాసాల్లో చెంచులు నివసిస్తున్నారు. వీటిలో 20 ఆవాసాలు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని కోర్‌ ఏరియాలో ఉన్నాయి. అడవిలో అటవీ శాఖ ఆంక్షల నేపథ్యంలో ఇక్కడి చెంచులు కనీస మౌలిక సదుపాయాలకు సైతం నోచుకోవడం లేదు. అడవిలో ఉన్న అప్పాపూర్‌ గ్రామ పంచాయతీ మినహా మరెక్కడా చెంచుపెంటల్లో కనీసం అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, వైద్యశాల లేవు. 

మేం అడవిలోనే ఉంటాం.. బయటకు పోలేం 
ఏళ్లుగా తాతల కాలం నుంచి అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మేం బయటకు పోయి జీవించలేం. మా వల్ల వన్యప్రాణులు, పులులకు ఎలాంటి హాని లేదు. ఇప్పుడు కూడా ఉండదు. దయచేసి మమ్మల్ని అడవి నుంచి విడదీయద్దు. మేమంతా అడవిలోనే ఉంటాం.  
–చిగుర్ల లింగమ్మ, చెంచు మహిళ, సార్లపల్లి, అమ్రాబాద్‌ మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా 

మమ్మల్ని ఆగం చేయొద్దు.. 
అడవిలో ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని ఆగం చేయద్దు. మేం బయటి ప్రపంచంలో బతకలేం. బాచారం లాంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తే అక్కడ ఏజెన్సీ నియమాలు, హక్కులు వర్తించవు. మైదాన ప్రాంతాల్లో ఉన్న చెంచులు మాకంటే దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. 
– కుడుముల మల్లేశ్, చెంచు యువకుడు, సార్లపల్లి

 స్వచ్ఛందంగా ముందుకొస్తేనే.. 
టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతాల్లో జంతు సంరక్షణ కోసమే స్థానికులకు మరోచోట పునరావాసం కలి్పస్తున్నాం. రీ లొకేషన్‌లో ఒత్తిడి లేదు, స్వచ్ఛందంగా ముందుకొస్తేనే తరలింపు ఏర్పాట్లు చేస్తున్నాం.        

– రోహిత్‌ గోపిడి, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్‌ జిల్లా 

Advertisement

తప్పక చదవండి

Advertisement