యూపీఎస్సీలా టీఎస్‌పీఎస్సీ! | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీలా టీఎస్‌పీఎస్సీ!

Published Sat, Jan 6 2024 3:59 AM

Chief Minister Revanths appeal to UPSC Chairman - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  యూనియన్‌ పబ్లిక్‌ సర్విసు కమిషన్‌ (యూపీఎస్సీ) తరహాలో ‘తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)’ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం సహకరించాలని యూపీఎస్సీ చైర్మన్‌ మనోజ్‌ సోనిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కోరా­రు.

టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ మొదలు పోస్టుల భర్తీ వరకు యూపీఎస్సీ తరహాలోనే జరిగేలా తగిన మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్‌తో, అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వినతిపత్రాలు సమర్పించారు. 

తగిన సహకారం అందించండి 
మంత్రి ఉత్తమ్, సీఎస్‌ శాంతికుమారి, ఇతర అధికారులతో కలసి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్‌ మనోజ్‌ సోని, కార్యదర్శి శశిరంజన్‌కుమార్‌లతో రేవంత్‌ భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన అంశంపై చర్చించారు. వివాద రహితంగా పరీక్షల నిర్వహణ, నియామకాల్లో పారదర్శకత విషయంలో సహకరించాలని వారిని కోరారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటకుండా సమర్థవంతంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ప్రశంసించారు. 

ఏడాది చివరికల్లా రెండు లక్షల ఉద్యోగాలు 
తెలంగాణలో చేపట్టే నియామకాల్లో నూతన విధానాలు, పద్ధతులను పాటించాలని నిర్ణయించినట్టు యూపీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి సీఎం రేవంత్‌ వివరించారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి.. కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. ఫలితంగా పేపర్‌ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందని పేర్కొన్నారు. తాము రాజకీయ ప్రమేయం లేకుండా టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని.. అవకతవకలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు. 

సీఎం దృష్టి సారించడం అభినందనీయం 
టీఎస్‌పీఎస్సీ నియామకాల ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించడం అభినందనీయమని యూపీఎస్సీ చైర్మన్‌ మనోజ్‌ సోని పేర్కొన్నారు. యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని.. సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన వివరించారు. టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నానికి తాము సహకారం అందిస్తామని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తోపాటు సభ్యులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ భేటీలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాణిప్రసాద్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. 
 
రక్షణశాఖ భూములను రాష్ట్రానికి ఇవ్వండి 
యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో రాష్ట్ర బృందం భేటీ అయి చర్చించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. హైదరాబాద్‌ నగరంలో రహదారులు, ఎలివేటెడ్‌ కారిడర్ల నిర్మాణం, విస్తరణ కోసం.. రక్షణశాఖ పరిధిలో ఉన్న పలు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవంత్‌ కోరారు. ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతుబజార్‌ వద్ద స్కైవాక్‌ నిర్మిస్తున్నామని.. అక్కడ రక్షణశాఖ పరిధిలో ఉన్న కాస్త భూమిలో మినహా మిగతా భాగం పూర్తయిందని వివరించారు.

ఆ భూమిని వెంటనే బదిలీ చేస్తే.. నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌–రామగుండంను కలిపే రాజీవ్‌ రహదారిలో.. ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి ఔటర్‌రింగు రోడ్డు జంక్షన్‌ వరకు 11.3 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం.. ఎంట్రీ, ఎగ్జిట్‌ ర్యాంపుల నిర్మాణం కోసం 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

నాగ్‌పూర్‌ హైవే (ఎన్‌హెచ్‌–44)పై కూడా కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు 18.30 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదించామని.. ఇందులో 12.68 కిలోమీటర్ల మేర నిర్మాణం, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలు, భవిష్యత్తులో డబుల్‌ డెక్కర్‌ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాల కోసం మరో 56 ఎకరాల రక్షణ శాఖ భూములను బదిలీ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారు. 

హైదరాబాద్‌కు ప్రత్యేక నిధులివ్వండి 
15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,233.54 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 2019–20 నుంచి 2023–24 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున మొత్తం రూ.1,800 కోట్లు రావాల్సి ఉందని, వెంటనే ఇవ్వాలని కోరారు. వీటితోపాటు హైదరాబాద్‌ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement