డప్పు కొట్టి.. ఎండగట్టి | Sakshi
Sakshi News home page

డప్పు కొట్టి.. ఎండగట్టి

Published Sat, Dec 18 2021 2:39 AM

Cm Kcr Announced Will Continue Fight Against Bjp Issue Of Paddy Procurement  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ధాన్యానికి మద్దతు ధర, కొనుగోలు వంటి అన్ని అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నా బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజా వ్యతిరేక, మతతత్వ బీజేపీ వైఖరిని ఎండగట్టి, ఆ పార్టీని బొంద పెట్టకపోతే మనం బోనులో నిలబడాల్సి వస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై కోటి సంతకాలు సేకరించాలి’అని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు హితబోధ చేశారు.

తెలంగాణ భవన్‌ లో శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ, మండలి సభ్యులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. సుమారు మూడు గంటల పాటు ఈ భేటీ సాగింది. ‘వానాకాలం ధాన్యం కొనుగోలుకు కేంద్రం విధించిన లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నందున ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యానికి సంబంధించి కేంద్రం వైఖరి ఏంటో నిలదీయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి నేతృత్వంలో ఆరుగురు మంత్రులతో పాటు టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం శనివారం ఢిల్లీకి చేరుకుని కేంద్ర మంత్రులను కలుస్తుంది. ఈ బృందంలో మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌ సభ్యులుగా ఉంటారు’అని కేసీఆర్‌ ప్రకటించారు.  

మౌనంగా ఉంటే మీకే  
‘నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశించిన కోటిరెడ్డి పార్టీ నిర్ణయాన్ని గౌరవించడంతో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఏడేళ్ల క్రితం నేను గజ్వేల్‌ నుంచి పోటీ చేసే క్రమంలో పార్టీలో చేరి నా గెలుపు కోసం పనిచేసిన డాక్టర్‌ యాదవరెడ్డికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నా నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. అలా ఉంటే నష్టపోయేది మీరే అనే విషయం గుర్తుంచుకోండి. జిల్లాల్లో మంత్రులు తమ నియోజకవర్గానికే  పరిమితం కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అందరినీ కలుపుకుని వెళ్లాలి. పార్టీ నేతల నడుమ గ్యాప్‌ ఉండకూడదు. అందరూ నాకు సమానమే. ఎన్నికలు రెండేళ్లా మూడేళ్లా అనేది కాదు.. ఎంత యాక్టివ్‌గా పనిచేస్తున్నామన్నదే ముఖ్యం. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కమిటీలకు అధ్యక్షుడు లేదా కన్వీనర్‌ను నియమించాలా అనే అంశంపై వారం రోజుల్లో ప్రకటన చేస్తా. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్ల సేవలు వినియోగించుకోవాలి’.

తమిళనాడులో బలంగా ప్రాంతీయ వాదం.. 
తమిళనాడులో డీఎంకే పార్టీ దశాబ్దాలుగా ప్రాంతీయ వాదాన్ని బలంగా వినిపిస్తూ ముందుకు సాగుతోంది. తరతరాలుగా అనేక కుటుంబాలు డీఎంకేతో రాజకీయ బంధాన్ని పెనవేసుకున్నాయి. మనం కూడా డీఎంకే తరహాలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలి. ఇటీవల కాశీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తాము చేసిన అభివృద్ధి గురించి కాకుండా సంబంధం లేని విషయాలు మాట్లాడారు’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. రైతుబంధు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని సమావేశంలో తెలియజేశారు.  

కేసీఆర్‌ బతికి ఉన్నంత వరకు రైతుబంధు 
‘దేశంలో ఎక్కడా లేని రీతిలో రైతుబంధు పథకాన్ని అమలు చేసి రూ.50వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. కేసీఆర్‌ బతికి ఉన్నంత వరకు రైతుబంధు కొనసాగుతుంది. దళితబంధు పథకాన్ని కూడా హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు ఇప్పటికే ఎంపిక చేసిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలు, యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి వేయి మంది చొప్పున ఎంపిక చేసి దళితబంధు అమలు చేసేందుకు బడ్జెట్‌లో రూ.20వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్ల మేర కేటాయిస్తాం. దళితబంధు లబ్దిదారుల ఎంపిక అధికారాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించే ఉత్తర్వులు త్వరలో వెలువడతాయి’అని కేసీఆర్‌ ప్రకటించారు.

మీ గెలుపు బాధ్యత నాదే...
పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు తప్పకుండా లభిస్తాయి. ఈ క్రమంలో నాయకులకు కొంత ఓపిక అవసరం.వివిధ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చురుగ్గా పనిచేస్తే మిమ్మల్ని మళ్లీ గెలిపించే బాధ్యత నాదే.  

Advertisement
Advertisement