చరిత్రాత్మక వేడుకగా అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ | Sakshi
Sakshi News home page

చరిత్రాత్మక వేడుకగా అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

Published Wed, Apr 5 2023 2:44 AM

CM KCR Comments On Ambedkar statue unveiling event - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల ఎత్తయిన విగ్రహావిష్కరణను అత్యంత వైభవోపేతంగా, చరిత్రాత్మక వేడుకగా, కన్నుల పండువగా దేశం గర్వించే రీతిలో జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. తెలంగాణ సమాజంతోపాటు యావత్‌ దేశ ప్రజలు సంబురపడేలా శోభాయమానంగా, గొప్పగా మహా విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామన్నారు.

దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో, అంబేడ్కర్‌ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ నెల 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నిర్వహించతలపెట్టిన విగ్రహావిష్కరణ, అనంతరం నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.  

బౌద్ధ సంప్రదాయ పద్ధతిలో... 
‘ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా పూల జల్లు కురిపిస్తూ ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించాలి. గులాబీలు, తెల్ల చామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందించాలి. బౌద్ధ భిక్షువులను ఆహ్వానించి వారి సంప్రదాయ పద్ధతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

అత్యద్భుతంగా విగ్రహం ఆవిష్కృతమైంది.. 
‘ఊహించినదానికంటే అత్యద్భుతంగా విగ్రహ రూపం ఆవిష్కృతమైంది. ప్రసన్నవదనంతో నిలుచుని వున్న అంబేద్కరుడు వొక తాత్విక జ్జానిగా అలరిస్తున్నాడు’అని సీఎం కేసీఆర్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. విగ్రహ రూపశిల్పి, 98 ఏళ్ల పద్మభూషణ్, రామ్‌వంజీ సుతార్‌ కృషిని ప్రశంసించారు. ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు. 

ఆశయాల అనుసరణ కోసమే.. 
‘సామాజిక న్యాయం కోసం పోరాడిన అంబేడ్కర్‌ కృషి, త్యాగం అజరామరం. దళితులు, గిరిజనులు బహుజనులు, భారతదేశ ప్రజలే కాదు... వివక్షను ఎదుర్కొనే ప్రతి చోటా అంబేడ్కర్‌ ఆశయం సాక్షాత్కారమవుతుంది. అంబేడ్కర్‌ విశ్వమానవుడు. అత్యున్నత స్థాయిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఆయన అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్ఫూర్తి పొందడమే’అని సీఎం అన్నారు.

ఆయన ఆశల కోసం ప్రజాప్రతినిధులు, యావత్‌ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామన్నారు. నాలుగు దశాబ్దాల కిందే తాను ఎమ్మెల్యేగా దళితుల స్థితిగతులను, ప్రపంచంలోని అణగారిన వర్గాలతో పోల్చుతూ అధ్యయనం చేయాలనే తలంపుతో ‘సెంటర్‌ ఫర్‌ సబాల్టర్న్‌ స్టడీస్‌’అనే అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు.

అంటరానితనం పేరుతో దుర్మార్గమైన రీతిలో వివక్షకు గురవుతున్న దళితుల అభ్యున్నతికి, అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం అంబేడ్కర్‌ పడిన శ్రమ, చేసిన కృషిని ఆసియా ఖండంలో మరొకరు చేయలేదని స్పష్టం చేశారు. 

సమావేశంలో సీఎం తీసుకున్న నిర్ణయాలు 
► విగ్రహావిష్కరణకు సచివాలయ అధికారులు, సిబ్బంది, అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరుకావాలి. 

► ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది బహిరంగ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. 

► అంబేడ్కర్‌ పాటలు ఆ మహనీయునికి తెలంగాణ సాంస్కృతిక నీరాజనం అర్పించాలి. 

► అంబేడ్కర్‌ మునిమనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ను ఏకైక ముఖ్యఅతిథిగా ఆహ్వనించాలి. 

మధ్యాహ్నం 2 గంటలకు సభ.. 
ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై 5 గంటలకు ముగుస్తుంది. సీఎస్‌ శాంతి కుమారి ప్రారంభోపన్యాసం తర్వాత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్య అతిథి ప్రకాశ్‌ అంబేద్కర్‌ ప్రసంగిస్తారు. అనంతరం సీఎం కేసీఆర్‌ సందేశం ఉంటుంది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement