6వ అంతస్తులో.. 6 ఫైళ్లపై సంతకం | Sakshi
Sakshi News home page

6వ అంతస్తులో.. 6 ఫైళ్లపై సంతకం

Published Mon, May 1 2023 3:52 AM

CM KCR continued the tradition of lucky number - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కొత్త సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో ప్రారంభించారు. తర్వాత 6వ అంతస్తులోని తన చాంబర్‌కు వెళ్లి సీట్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా తన సెంటిమెంట్‌ లక్కీ నంబర్‌ 6కు తగ్గట్టుగా 6 ఫైళ్లపై సంతకాలు చేశారు. 

2023–24లో దళితబంధు పథకం అమలుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్‌ తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్‌ మినహా రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున లబ్దిదారులకు ఈ పథకాన్ని వర్తింపచేసే ప్రతిపాదనలను ఆమోదించారు. 
 పోడుభూముల పట్టాల పంపిణీకి సంబంధించిన ఫైలుపై రెండో సంతకం చేశారు. మే నెల నుంచి జిల్లాల వారీగా పోడు పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తంగా లక్షా 35 వేల మందికి దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పట్టాలు ఇవ్వనున్నారు. 
♦ సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల పంపిణీకి సంబంధించిన ఫైలుపై సీఎం మూడో సంతకం చేశారు. 
గర్భిణులకు పౌష్టికాహారం అందించే.. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌కు సంబంధించిన ఫైలుపై నాలుగో సంతకం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ చేపట్టనున్నారు. ఈ ఏడాది 6.84 లక్షల మంది గర్భిణులకు 13.08 లక్షల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కిట్‌ విలువ రూ.రెండు వేలు. ఈ పథకానికి ప్రభుత్వం మొత్తం రూ.277 కోట్లు ఖర్చు చేయనుంది. 
♦ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై సీఎం ఐదో సంతకం సంతకం చేశారు. 
 పాలమూరు లిఫ్టు ఇరిగేషన్‌కు సంబంధించిన ఫైలుపై ఆరో సంతకం చేశారు. కరివెన, ఉద్ధండాపూర్‌ రిజర్వాయర్ల నుంచి నారాయణపూర్, కొడంగల్, వికారాబాద్‌లకు తాగునీటిని సరఫరా చేసే కాల్వల పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశారు.

Advertisement
Advertisement