-

మెదక్‌ నుంచే ప్రగతి శంఖారావం

23 Aug, 2023 03:38 IST|Sakshi

బీడీ ప్యాకర్లకు, టేకేదార్లకు ఆసరా పింఛన్లు, దివ్యాంగులకు రూ.4,016 పింఛన్‌: మంత్రి హరీశ్‌

మెదక్‌: రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలకు బుధవారం మెదక్‌ నుంచి శ్రీకారం చుట్టనుందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. మంగళవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీడీ ప్యాకర్లకు, టేకేదార్లకు ఆసరా పింఛన్లు, దివ్యాంగులకు రూ.4,016 పింఛన్‌ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు.

మెదక్‌ నుంచే ప్రగతి శంఖారావం పూరిస్తారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ను మూడోసారి అధికారంలోకి తెచ్చేలా ఇక్కడ బహిరంగసభ ఉంటుందని, ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి కేసీఆర్‌కు బహుమానంగా ఇస్తామని అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా విడుదలతో తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని, విపక్షాలు మాత్రం విలవిల్లాడుతున్నాయని పేర్కొన్నారు. టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారి నుంచి కాంగ్రెస్‌ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని హరీశ్‌ ఆరోపించారు.

తెలంగాణ పథకాలను కేంద్రంసహా వివిధ రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష అందిస్తుండగా, దీనిని కేంద్రం కాపీ కొట్టి విశ్వకర్మలకు రూ.లక్ష అప్పు ఇస్తామని ప్రకటించిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని, బీఆర్‌ఎస్‌ అంటే భారత రైతు సమితి అని కొత్త అర్థం చెప్పారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి గుమ్మడిదల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్‌ పట్టణానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్‌ఎస్‌ కార్యాలయం, 1.20 గంటలకు ఎస్పీ కార్యాలయం, 1.40 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే బహి రంగ సభలో మాట్లాడతారు. ఏర్పాట్లను మంత్రి హరీశ్‌ పర్యవేక్షించారు. ప్రారంభానికి ముస్తాబైన జిల్లా పోలీసు కార్యాలయ సముదాయం విద్యుత్‌ కాంతుల్లో మెరిసిపోతోంది. కలెక్టరేట్‌ భవనం, లోపలి చాంబర్లను రంగు రంగుల పూలు, విద్యుత్‌ దీపాలతో సిబ్బంది అలంకరించారు.

మరిన్ని వార్తలు