ఏడాదిలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

ఏడాదిలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్‌రెడ్డి

Published Thu, Feb 1 2024 2:52 AM

CM Revanth Reddy On Jobs Replacements In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రభు త్వ శాఖల్లో వచ్చే ఏడాదికాలంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పోలీసుశాఖలో త్వరలో 15 వేల ఉద్యోగ నియామకాలకు చర్య లు చేపడతామని, పోలీసు నియామకాల బోర్డు ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. దీనితోపాటు వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో 5వేల ఉద్యోగాలకు కూడా ప్రకటనలు ఇస్తామని.. తర్వాత తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా వేగంగా ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలిపారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని స్టాఫ్‌ నర్సు ఉద్యోగాలకు అర్హత పొందిన 6,956 మందికి బుధవారం ఎల్బీ స్టేడియంలో సీఎం ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్‌ మాట్లాడారు. 

కాంగ్రెస్‌తో ఉద్యోగాలు.. 
నిరుద్యోగుల కలల సాకారమే తెలంగాణ రాష్ట్రమని.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లపాటు నిరుద్యోగులు దగాపడ్డారని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేవలం కేసీఆర్‌ కుటుంబీకులకే ఉద్యోగాలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కేసీఆర్‌ బిడ్డ కవిత నిజామాబాద్‌లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీని చేసిన కేసీఆర్‌.. రాష్ట్రంలోని నిరుద్యోగులను మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టడంతో రాష్ట్రంలోని చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. మేం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల భర్తీ అంశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ నా దృష్టికి తీసుకువచ్చారు.

వెంటనే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి, భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తిచేశాం..’’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై తాము ప్రమాణ స్వీకారం చేసినది ఎల్బీ స్టేడియంలోనేని.. ఆ కార్యక్రమంతో తమ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారని రేవంత్‌ చెప్పారు. ఇప్పుడు నర్సులుగా ఎంపికైనవారి కుటుంబాల్లో అలాంటి సంతోషాన్ని చూసేందుకే ఇక్కడ నియామకపత్రాల పంపిణీ చేపట్టామన్నారు. 

రోజుకు 16గంటలకుపైగా పనిచేస్తున్నాం 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టామని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన మొదలుపెట్టామని, కొత్త చైర్మన్, సభ్యులను నియమించామని చెప్పారు. శాఖలవారీగా ఉద్యోగ ఖాళీలు, భర్తీ ప్రక్రియపై మరింత దృష్టి పెడుతున్నామన్నారు. మంత్రులు రోజుకు సగటున 16 నుంచి 18 గంటలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం పనిచేస్తున్నారన్నారు. అలాంటి ప్రజా ప్రభుత్వాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారని, వాటికి తాము వెరవబోమని వ్యాఖ్యానించారు.

స్టాఫ్‌ నర్సులుగా ఎంపికైన వారి కళ్లలో ఆనందాన్ని చూసి ఫాంహౌజ్‌లోని వారు కుళ్లుకుంటారని విమర్శించారు. కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావు ప్రజాప్రభుత్వంపై పిల్లి శాపాలు పెడుతున్నారని.. ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న కేసీఆర్‌ వెంటనే హరీశ్‌రావుకు గడ్డిపెట్టి నోరు మూయిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో 6,956 మందికి స్టాఫ్‌ నర్స్‌ నియామక పత్రాలు అందజేసి, వారితో ఉద్యోగ ప్రతిజ్ఞ చేయించారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. 

మాట నిలబెట్టుకుంటున్నాం: భట్టి విక్రమార్క 
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. వైద్యారోగ్య శాఖలో ఇంత పెద్ద సంఖ్యలో స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల భర్తీ గొప్ప విషయమన్నారు. ఇదే శాఖలో ఖాళీగా ఉన్న మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు వేగవంతం చేశామని తెలిపారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కంకణబద్ధమై ఉందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిందని.. దీనిని గాడిన పెట్టేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని చెప్పారు. పైసా పైసా పోగు చేస్తూ పనిచేస్తున్నామన్నారు. 

ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి: రాజనర్సింహ 
కొత్తగా నియమితులైన స్టాఫ్‌ నర్సుల్లో 88శాతం మహిళలు ఉండటం ఆనందంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అత్యుత్తమ సేవలు అందించి ప్రభుత్వ వైద్య విభాగానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమాజానికి విద్య, వైద్యం, సంక్షేమం ఎంతో కీలకమని.. తమ ప్రభుత్వం వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో వేగంగా స్టాఫ్‌ నర్సు నియామకాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. ఎందరు డాక్టర్లు వచ్చినా రోగికి దగ్గరగా ఉండి సేవలు అందించేది నర్సులేనని చెప్పారు.    

Advertisement
Advertisement