డ్రగ్స్‌ అంటేనే వణుకు పుట్టాలి | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ అంటేనే వణుకు పుట్టాలి

Published Tue, Dec 12 2023 1:05 AM

CM Revanth Reddy Review On Bureau Of Narcotics And Drugs: TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణ అంశంపై కొత్త ప్రభుత్వం ఫోకస్‌ చేసింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను ఉపయోగించాలంటే భయపడే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌ రవాణా, వినియోగాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని.. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై సోమవారం సచివాలయంలో రేవంత్‌ సమీక్షించారు. ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ శివధర్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సీవీ ఆనంద్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

గ్రేహౌండ్స్‌ మాదిరిగా నార్కోటిక్స్‌ బ్యూరో.. 
రాష్ట్రంలో ప్రస్తుతమున్న యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించాలని.. ఆ విభాగాన్ని బలోపేతం చేయాలని రేవంత్‌ ఆదేశించారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు, ఇతర సౌకర్యాలను సమకూర్చాలని సూచించారు. డ్రగ్స్‌ విక్రయాలు, వినియోగాన్ని నిరోధించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ల మాదిరిగా టీఎస్‌ నాబ్‌ను తీర్చిదిద్దాలని సూచించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్, ఔషధ నియంత్రణ మండలి, పోలీస్‌ శాఖలకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 

సినీతారల డ్రగ్స్‌ కేసు ఏమైంది? 
గతంలో సంచలనం సృష్టించిన సినీ తారల డ్రగ్స్‌ కేసుపై సీఎం రేవంత్‌ ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. ఆ కేసు గురించిన కీలక అంశాలను అధికారుల నుంచి వివరంగా తెలుసుకున్నట్టు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌ పలుమార్లు సినీ తారల డ్రగ్స్‌ కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ.. బీఆర్‌ఎస్‌ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

ఈ వ్యవహారంపై స్వయంగా కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో సోమవారం జరిగిన నార్కోటిక్స్‌ సమీక్షలో సీఎం హోదాలో డ్రగ్స్‌ కేసు వివరాలను ఆయన తెలుసుకున్నారు. సినీతారల కేసులో ఏం జరిగింది? ఇప్పుడా కేసు స్టేటస్‌ ఏమిటి? దర్యాప్తు ఎలా జరిగింది? నిందితుల నుంచి సేకరించిన ఎల్రక్టానిక్‌ డివైజ్‌లను, ఇతర కీలక వస్తువులను ఫోరెన్సిక్‌ పరిశీలనకు ఎందుకు పంపలేదంటూ ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రతి ఒక్కరి విచారణ సందర్భంగా చేసిన వీడియో రికార్డింగ్‌లు, వారి కాల్‌డేటా, ఎల్రక్టానిక్‌ డివైజ్‌లు, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించామని.. చార్జిషిట్‌ కూడా నమోదు చేశామని అధికారులు వివరించినట్టు తెలిసింది.

Advertisement
Advertisement