నేటితో ముగియనున్న సీఎంఆర్‌ గడువు  | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న సీఎంఆర్‌ గడువు 

Published Wed, Jan 31 2024 4:06 AM

CMR deadline will end today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది ఖరీఫ్‌నకు సంబంధించిన సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) డెలివరీ బుధవారంతో ముగియనుంది. ఆ సీజన్‌లో మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం బకాయిలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో కేంద్రాన్ని గడువు కోరవద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిల్లర్లు, అధికారులపై ఒత్తిడి తెచ్చి 50 రోజుల్లో 20 ఎల్‌ఎంటీ మేర బియ్యం సేకరించింది.

ఇంకా 2022–23 సీజన్‌కు సంబంధించి మరో 4.80 ఎల్‌ఎంటీ ఎఫ్‌సీఐకి రావాల్సి ఉన్నా, రైస్‌మిల్లర్లు డెలివరీ చేయడంలో విఫలమయ్యారు. కాగా సీఎంఆర్‌ డెలివరీ గాడిన పడుతున్న నేపథ్యంలో మరో నెలరోజుల గడువు పొడిగించాలని మిల్లర్లు కోరుతున్నారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం ఎఫ్‌సీఐకి ఇస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా అక్కడే ఉన్న సీఎంఆర్‌ గడువు పొడిగింపునకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

కనీసం నెల రోజుల టైమ్‌ ఇస్తే.. గతేడాది ఖరీఫ్‌ సీఎంఆర్‌ బకాయిలు పూర్తిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే 4.80 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లర్ల వద్దనే ఉండిపోతుంది. దీని విలువ కనీసం రూ.1,872 కోట్లు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రికవరీ చేయటం కూడా కష్టంగా ఉంటుంది. ఎఫ్‌సీఐకి బదులుగా సివిల్‌ సప్లయీస్‌ కోటా కింద తీసుకోవాల్సి వస్తుంది. కానీ సివిల్‌ సప్లయ్‌ తీసుకునేది లేదని చెప్పిన నేపథ్యంలో నెల రోజుల గడువు పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఢిల్లీలో లాబీయింగ్‌ చేస్తున్నట్టు సమాచారం. 

గత ఏడాది రబీ ధాన్యం వేలానికి... 
కాగా నిరుడు యాసంగి సీజన్‌కు సంబంధించిన బియ్యం బకాయిలు 32.74 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. అంటే 50 ఎల్‌ఎంటీ ధాన్యం గోడౌన్‌లలో ఉంది. ఇందులో 35 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభు త్వం నియమించిన కమిటీ నిర్ణయించింది టెండర్లు కూడా ఆహ్వానించింది. కాగా ధాన్యం టెండర్లకు సంబంధించిన ప్రీ బిడ్డింగ్‌ సమావేశం బుధవారం పౌరసరఫరాలభవన్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కమిషనర్‌ డీఎస్‌.చౌహాన్‌ హాజరయ్యే అవకాశాలున్నాయి.  

Advertisement
Advertisement