రాష్ట్రంలోనూ పంటల బీమా! | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలోనూ పంటల బీమా!

Published Mon, Dec 25 2023 6:37 AM

Compensation as a farmer unit from next kharif season - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసే యోచనలో ఉంది. రైతు యూని ట్‌గా దీని రూపకల్పనకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు.

వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి ఈ పథకం అమలు జరిగేలా కార్యా చరణ ఉంటుందన్నారు. పంటల బీమా అమలు లోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుంది. పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లి స్తుంది.

పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలి. అయితే రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజన ముంటుందని అధికారులు అంటున్నారు. 

పంటల బీమా లేక రైతుల అవస్థ: కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016–17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది.

అయితే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్‌ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం అందే అవకాశమే లేకుండా పోయింది.  2020–21 వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 2021–22లోనూ 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు.

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలో వడగళ్లు, భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేయగా, చివరకు వ్యవసాయశాఖ 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తేల్చింది. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతులకు రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది.

ఇక మొన్నటికి మొన్న ఈ నెల మొదటివారంలో రాష్ట్రంలో తుపాను కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు. వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంలోనూ విఫలమైంది. ఇలా ప్రతీ ఏడాది రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. 

పంటల బీమాతోనే రైతులకు మేలు
ఫసల్‌ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గత ప్రభుత్వ హయాంలోనే కసరత్తు జరిగింది. గ్రామం యూనిట్‌గా కాకుండా రైతు యూనిట్‌గా దీనిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే  రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయి.

బెంగాల్‌ ప్రభుత్వం విజయవంతంగా సొంత పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ అధ్యయనం చేసి, ఆ ప్రకారం ముందుకు సాగాలని అధికారులు అనుకున్నారు. కానీ ఏదీ ముందుకు పడలేదు. కేంద్ర ఫసల్‌ బీమా పథకం వల్ల కంపెనీలకు లాభం జరిగిందనేది వాస్తవమే కావొచ్చు. కానీ ఎంతో కొంత రైతులకు ప్రయోజనం జరిగిందని కూడా రైతు సంఘాలు అంటున్నాయి. 

► 2016–17లో తెలంగాణలో వివిధ కారణాలతో 1.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో 2.35 లక్షల మంది రైతులు రూ. 178 కోట్లు నష్టపరిహారం పొందారు. 
► 2017–18లో వివిధ కారణాలతో 3.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో 4.42 లక్షల మంది రైతులు రూ. 639 కోట్లు పరిహారం పొందారు. 
► 2018–19లో 1.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 2.2 లక్షల మంది రైతులు రూ. 570 కోట్ల పరిహారం పొందారు. 
► 2019–20లో 2.1 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 3.24 లక్షల మంది రైతులు రూ. 480 కోట్ల పరిహారం పొందారు. 
►ఫసల్‌ బీమా పథకం నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయశాఖ నష్టం అంచనాలు వేయడం కూడా నిలిపివేసింది. దీంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు.  

Advertisement
Advertisement