ఐపీఎస్‌ పాఠ్యాంశాల్లో ప్రవర్తన, నైతిక విలువలు | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ పాఠ్యాంశాల్లో ప్రవర్తన, నైతిక విలువలు

Published Thu, Oct 26 2023 3:04 AM

Conduct and Ethical Values in IPS Curriculum - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీసు అకాడమీలో (ఎస్‌వీపీఎన్‌పీఏ) ఐపీఎస్‌ ట్రైనీలకు ఇచ్చే శిక్షణలో ప్రవర్తనకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు డైరెక్టర్‌ అమిత్‌ గార్గ్‌ చెప్పారు. ఇందులోభాగంగా ఈ ఏడాది నుంచి ప్రవర్తన, నైతి క విలువలు, మానవ హక్కులు అనే కొత్త పాఠ్యాంశాన్ని చేర్చామన్నారు.

అకాడమీలో తొలి దశ శిక్షణ పూర్తి చేసుకున్న 75వ రెగ్యులర్‌ రిక్రూటీస్‌ (ఆర్‌ ఆర్‌) బ్యాచ్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ శుక్రవారం జరగనుందని, దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరవుతారని తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందిన వాటిలో ఇది 75వ బ్యాచ్‌ కావడంతో ‘అమృత్‌కాల్‌ బ్యాచ్‌’గా పరిగణిస్తూ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బుధవారం అకాడమీలో జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన వెల్లడించిన వివరాలివీ...  

ఎప్పటికప్పుడు శిక్షణను విశ్లేషిస్తూ... 
సమకాలీన అవసరాలకు తగ్గట్టు ట్రైనింగ్, పాఠ్యాంశాల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రవర్తనకు సంబంధించిన అంశాలతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్, సైబర్‌ క్రైమ్‌ మాడ్యుల్‌ను కొత్తగా చేర్చారు. దేశంలోని ఒక్కో రాష్ట్ర పోలీసు విభాగం ఒక్కోఅంశంలో ప్రత్యేకత కలిగి ఉంది. అవన్నీ సమ్మిళితం చేసి ట్రైనీలకు నేరి్పస్తున్నారు. కీలక, సంచలనాత్మక కేసుల్ని దర్యాప్తు చేసిన వారినే గెస్ట్‌ ఫ్యాకల్టిలుగా పిలిపించి వారి అనుభవాలను ట్రైనీలకు తెలియజేస్తున్నారు. శిక్షణలో అనుష్త కాలియా ఓవరాల్‌ టాపర్‌గా నిలిచారు. వచ్చే నెల 14 నుంచి 76వ బ్యాచ్‌ ట్రైనింగ్‌ మొదలు కానుంది.  

మాక్‌ కోర్టులు సైతం నిర్వహిస్తూ... 
సాధారణంగా ఐపీఎస్‌ అధికారులకు ఎఫ్‌ఐఆర్, పంచనామా సహా ఇతర రికార్డులు రాసే అవసరం, అవకాశం ఉండదు. అయితే వీటిపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో వారి విధి నిర్వహణ పక్కాగా ఉంటుంది. దీంతో వారితోనే కొన్ని చార్జ్‌షీట్లు తయారు చేయిస్తున్నారు. న్యాయవాదులు, రిటైర్డ్‌ న్యాయమూర్తులతో మాక్‌ కోర్టులు నిర్వహిస్తూ విచారణ చేయించి రికార్డుల్లోని లోపాలు వారికి తెలిసేలా చేస్తున్నారు.

ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 75వ బ్యాచ్‌లో 155 మంది (2021, 2022 బ్యాచ్‌ల ఐపీఎస్‌లు) ఉన్నారు. వీళ్లు శిక్షణలోనే కర్ణాటక ఎన్నికలు, హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు తదితర బందోబస్తుల్లో పాల్గొన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవడం, ఆయన సెక్యూరిటీలో తలెత్తిన లోపాలను ఓ కేస్‌స్టడీగా పరిచయం చేశారు. ఇప్పుడు శిక్షణ పొందిన వారిలో తెలంగాణకు 14 (మహిళలు–5, పురుషులు–9) మంది, ఏపీకి 15 (మహిళలు–5, పురుషులు–10) మందిని కేటాయించారు.

ఐఆర్‌ఎస్‌ నుంచి ఐపీఎస్‌కు.. 
అల్వాల్‌ మా స్వస్థలం. బీ ఫార్మసీ, ఎంబీఏ పూర్తి చేశా. తండ్రి రిటైర్డ్‌ జడ్జి. ఆయనకు ఇచ్చిన మాట కోసమే ఐపీఎస్‌ కావాలనుకున్నా. 2016లో 10 మార్కులు తక్కువ రావడంతో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యా. బెంగళూరు, గోవాల్లో ఆదాయపు పన్ను శాఖలో ఐదేళ్ల పాటు పని చేశా. 2021లో చివరి ప్రయత్నంలో 155వ ర్యాంక్‌తో ఐపీఎస్‌ సాధించా. తెలంగాణ కేడర్‌కే అలాట్‌ కావడం సంతోషంగా ఉంది.    – ఎస్‌.చిత్తరంజన్, ఐపీఎస్‌ ట్రైనీ  

తెలుగు నేర్చుకోవడమే తొలి లక్ష్యం 
మాది మహారాష్ట్ర. ముంబైలోని ఐసీటీ నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. తండ్రి అక్కడే ఏఎస్సై, మేనమామ హెడ్‌–కానిస్టేబుల్‌. వీరి ప్రోద్బలంతోనే పోలీసు కావాలనుకున్నా. రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ వచ్చింది. తెలంగాణ కేడర్‌కు అలాట్‌ అయ్యా. అందుకే తెలుగు నేర్చుకోవడమే నా తొలి లక్ష్యం. అప్పుడే ఇక్కడి ప్రజలతో మమేకం కాగలం.  – చేతన్‌ పందేరి, ఐపీఎస్‌ ట్రైనీ 

Advertisement
Advertisement