Conflicts Between Governor And Telangana Government - Sakshi
Sakshi News home page

గవర్నర్ల సొంత ఎజెండా!

Published Mon, Jan 30 2023 4:31 AM

Conflicts Between Governor and Telangana Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు సూచించారు. ఆయా రాష్ట్రాల్లో వారి వ్యవహారం ఆందోళనకరంగా ఉందన్నారు. తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ మొదలైన చోట్ల గవర్నర్లు సొంత ఎజెండాతో పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యాన్ని నిరోధించడంపై దేశంలోని విపక్ష పారీ్టల నేతలతో కలిసి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దుర్మార్గమైన తీరును దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల విపక్ష పారీ్టలను కూడా కలుపుకొని పోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ మేరకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన విపక్ష నేతలతో మాట్లాడుతున్నట్లుగా కేసీఆర్‌ తెలిపారని పార్టీవర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీ, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, స్టాలిన్, విజయన్‌లతో పాటు విపక్ష నేతలు అఖిలేశ్‌ యాదవ్, తేజస్వీ యాదవ్‌ తదితరులతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపాయి. విపక్ష పార్టీల సహకారంతో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వివరించాయి. ఇలావుండగా కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత, ప్రమాదకర విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు జరుగుతున్న తీరని నష్టాన్ని ఎంపీలకు కేసీఆర్‌ వివరించారు. పార్లమెంటు జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ, కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం 
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రగతిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తోంది. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికం. రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తిస్తూ కేంద్రం, రాష్ట్రాల నడుమ సంధానకర్తలుగా ఉండాల్సిన గవర్నర్ల వ్యవస్థను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న దుర్మార్గ విధానాలను బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలి. రాష్ట్ర కేబినెట్‌ సహా, అత్యున్నత సభలైన శాసనసభ, శాసనమండలి తీసుకున్న నిర్ణయాలను సైతం బేఖాతరు చేస్తూ గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని, అభివృద్ధిని, పాలనను అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలను, కేంద్రం వైఖరిని ఎండగట్టాలి..’ అని కేసీఆర్‌ ఆదేశించారు. 

అభివృద్ధికి ఆటంకాలుగా కేంద్రం విధానాలు 
‘కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు, అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. దేశ ప్రజలు కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా అప్పనంగా తమ కార్పొరేట్‌ స్నేహితులకు కట్టబెడుతున్నారు. తమకు అనుకూల కార్పొరేట్‌ శక్తులపై ప్రేమ కురిపిస్తూ లక్షల కోట్ల రూపాయల రుణాలను కేంద్రం రద్దు చేస్తోంది. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెట్టడంతో వారి కంపెనీల డొల్లతనం బయటపడుతూ షేర్ల విలువ హఠాత్తుగా పడిపోయింది. ఒక్క రోజులోనే రూ.లక్షల కోట్లు నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తోంది. వారి లాభాలు, సంపద అంతా నీటి బుడగేనని స్పష్టమవుతోంది. ఇలాంటి ఆర్థిక అవకతవకలకు దోహదం చేసే విధంగా దేశ సంపదనంతా ప్రైవేట్‌ పరం చేస్తూ,  కేంద్రం తీరని నష్టం చేస్తోంది.

లాభాలను ప్రైవేట్‌ పరం చేస్తూ నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర ఆర్ధిక విధానాలపై పార్లమెంటు ఉభయ సభల్లో గొంతెత్తాలి. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న తీరును బీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్రంగా ఖండించాలి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ తదితర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడి బతుకు రోజురోజుకూ భారమైపోతున్నా కేంద్రానికి ఏమాత్రం పట్టింపులేదు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను పార్లమెంటు వేదికగా దేశ ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేయాలి.

రాష్ట్ర విభజన హామీలపై కూడా నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి కలిసివచ్చే దేశంలోని ప్రతి పార్టీ ఎంపీని కలుపుకొని పోవాలి. ఆయా అంశాలపై ఉభయ సభల్లో నిలదీయాలి..’ అని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు (రాజ్యసభ), నామా నాగేశ్వర్‌రావు (లోక్‌సభ), ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, కేఆర్‌ సురేష్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్‌ కవితా నాయక్, పసునూరి దయాకర్, బొర్లకుంట వెంకటేశ్, పోతుగంటి రాములు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement