‘రిజర్వ్‌’ కావాల్సిందే!  | Sakshi
Sakshi News home page

Congress: ఆ అసెంబ్లీ స్థానాలపైనే కాంగ్రెస్ ఫోకస్     

Published Sun, Mar 5 2023 3:14 AM

Congress Focus on To Get The seats Of Sc and St Reserved Seats  - Sakshi

 రాష్ట్రంలోని 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్‌ చేసింది. గత ఎన్నికల్లో వీటిలో పదింటిని గెలుచుకున్న ఆ పారీ్ట.. ఈసారి మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకునే దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందుకోసం రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల నియామకం, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయి కమిటీల ఏర్పాటు, స్థానిక సమస్యల గుర్తింపు, కేడర్‌కు శిక్షణ, అవగాహన, రాష్ట్ర స్థాయిలో ‘సామాజిక న్యాయ సదస్సు’ నిర్వహణ వంటి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ‘లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ (ఎల్‌డీఎం)’ పేరిట ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది.

దీనిపై ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ శనివారం గాంధీభవన్‌లో భేటీ అయింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ నేత కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావేద్, రోహిత్‌ చౌదరి, ఆదివాసీ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బెల్లయ్యనాయక్, టీపీసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విభాగాల అధ్యక్షులు, ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్‌ తదితరులు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 31 రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా రూపొందించాల్సిన కార్యాచరణపై ఇందులో చర్చించారు. వారం రోజుల్లోగా సదరు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించాలని నిర్ణయించారు. 

ఏఐసీసీ ఆధ్వర్యంలో.. 
దేశవ్యాప్తంగా రిజర్వుడ్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో (పార్టీ బలంతో పాటు స్థానిక పరిస్థితుల మేరకు పోటీచేసే వీలు ఆధారంగా) కొన్నింటిని ఏఐసీసీ ఎంచుకుంది. ఇందులో 28 ఎస్టీ, 56 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీనిలో రాష్ట్రానికి చెందిన ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వుడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్నింటిని ఏఐసీసీ ఎంపిక చేసింది. అందులో తెలంగాణలో ఉన్న మొత్తం 12 ఎస్టీ, 19 ఎస్సీ రిజర్వుడ్‌ అసెంబ్లీ స్థానాలు ఉండటం గమనార్హం. ఈ పార్లమెంటు, అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది.

ఈ క్రమంలోనే రిజర్వుడ్‌ నియోజకవర్గాల కోసం ప్రత్యేకంగా ‘ఎల్‌డీఎం’ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో రిజర్వుడ్‌ స్థానాలకు చెందిన నాయకులతోపాటు ఆయా నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలను భాగస్వాములను చేసి.. పార్టీ గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను సమీకృతం చేయడం, బూత్, బ్లాక్, నియోజకవర్గ స్థాయిలో కేడర్‌కు శిక్షణ ఇవ్వడం ద్వారా నాయకత్వ మెళకువలు నేర్పడం, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై కేడర్‌కు అవగాహన కలి్పంచి ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి కార్యాచరణను అమలు చేయాలని పార్టీ రాష్ట్ర విభాగాలను ఆదేశించింది. 
 
రాష్ట్రంలో చేపట్టే చర్యలు ఏమిటంటే.. 
రాష్ట్రంలోని ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, డోర్నకల్, మహబూబాబాద్, దేవరకొండ, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, ములుగు (12) నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వ్‌ కాగా.. చెన్నూరు, బెల్లంపల్లి, జుక్కల్, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, జహీరాబాద్, ఆందోల్, చేవెళ్ల, వికారాబాద్, కంటోన్మెంట్, అచ్చంపేట, ఆలంపూర్, నకిరేకల్, తుంగతుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి (19) అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో ఏడు ఎస్టీ స్థానాలు, మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. మిగతా చోట్ల బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) అభ్యర్థులు విజయం సాధించారు. 
 
త్వరలో సమన్వయకర్తల నియామకం 

మొత్తం 31 రిజర్వుడ్‌ స్థానాల్లో 10 చోట్ల కాంగ్రెస్, మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలవడం, కాంగ్రెస్‌ ఆ ఎన్నికల్లో గెలిచిన మొత్తం స్థానాల్లో సగం ఇవే ఉండటంతో.. ఈసారి మొత్తం 31 స్థానాలపై టీపీసీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏఐసీసీ సూచనలు, సమన్వయంతో ఆయా నియోజకవర్గాలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శులను సమన్వయకర్తలుగా నియమించనుంది (పార్లమెంటు స్థానాలకు సమన్వయకర్తలను ఏఐసీసీ నియమిస్తుంది). ఈ సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన కేడర్, నాయకత్వాన్ని భాగస్వాములను చేస్తూ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయనున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో టీపీసీసీ అధ్యక్షుడు చైర్మన్‌గా, అనుబంధ విభాగాల్లో జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేత కనీ్వనర్‌గా, మిగతా అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సభ్యులుగా పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీకి అనుబంధంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల పర్యవేక్షణలో ఎన్నికలు ముగిసేంతవరకు ఆయా నియోజకవర్గాల్లో అవసరమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.   

Advertisement
Advertisement