‘విద్యుత్‌’ డైరెక్టర్లకు ఉద్వాసన?  | Sakshi
Sakshi News home page

‘విద్యుత్‌’ డైరెక్టర్లకు ఉద్వాసన? 

Published Sun, Dec 31 2023 4:45 AM

Congress government is focusing exclusively on the power sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో సుదీర్ఘకాలం నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారికి ఉద్వాసన పలికేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారి స్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కారు విద్యుత్‌ శాఖపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పిడీసీఎల్‌ తదితర సంస్థల చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు (సీఎండీ)గా ఐఏఎస్‌ అధికారులను నియమించింది. విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది.

తదుపరి చర్యగా కొత్త డైరెక్టర్ల నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్‌సర్విస్, రిటైర్డ్‌ విద్యుత్‌ అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. 2012 మే 14న ఇంధన శాఖ జారీ చేసిన జీవో 18 ప్రకారం నియామకాలు చేపట్టనున్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోల ఇన్‌చార్జి సీఎండీ సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి.. ఒక్కో డైరెక్టర్‌ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్‌ లిస్టును రూపొందించి ప్రభుత్వానికి అందించనుంది.

ఈ సెలెక్షన్‌ కమిటీలో ఆయా విద్యుత్‌ సంస్థల సీఎండీలు కన్వినర్లుగా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వం నామినేట్‌ చేసే విద్యుత్‌ రంగ స్వతంత్ర నిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ సిఫార్సు చేసినవారి నుంచి డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. 

అర్హతలు ఉంటేనే కొలువు 
గతంలో కనీస అర్హతలు లేనివారిని విద్యుత్‌ సంస్థల్లో డైరెక్టర్లుగా నియమించడంతోపాటు అడ్డగోలుగా పదవీ కాలాన్ని పొడిగించినట్టు ఆరోపణలున్నాయి. డైరెక్టర్‌గా ఎంపికయ్యే వారికి కనీసం చీఫ్‌ ఇంజనీర్‌గా మూడేళ్ల అనుభవం ఉండాల్సి ఉన్నా.. డీఈలుగా రిటైరైన వారిని సైతం నియమించి కీలక విభాగాలను అప్పగించినట్టు విమర్శలున్నాయి. దీంతో ఈసారి పక్కాగా నిబంధనలను అనుసరించి నియామకాలు జరపాలని నిర్ణయించి, పాత ఉత్తర్వులను వెలికితీశారు.

ఆ ఉత్తర్వుల ప్రకారం డైరెక్టర్‌ పదవికి ఎంపిక కావాలంటే.. సంబంధిత విద్యుత్‌ విభాగాల కార్యకలాపాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవంతోపాటు మొత్తంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసి ఉండాలి. కనీసం మూడేళ్లపాటు చీఫ్‌ ఇంజనీర్‌/చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌/ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లేదా తత్సమాన హోదాల్లో పనిచేసి ఉండాలి. నోటిఫికేషన్‌ నాటికి వయసు 65 ఏళ్లకు మించరాదు.
 
పదవీకాలం రెండేళ్లే.. 
నిబంధనల ప్రకారం డైరెక్టర్‌ పదవీకాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలెక్షన్‌ కమిటీ సిఫార్సులతో ఏడాది చొప్పున రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించడానికి వీలుంది. ప్రస్తుతం ట్రాన్స్‌కోలో నలుగురు, జెన్‌కోలో ఏడుగురు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 8 మంది, ఎన్పిడీసీఎల్‌లో 8 మంది కలిపి మొత్తం 27 మంది డైరెక్టర్లు కొనసాగుతున్నారు.

వీరిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నుంచీ, మరికొందరు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ కొనసాగుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వీరే డైరెక్టర్లుగా కొనసాగుతారంటూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇలా సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. కొందరి వయసు 85ఏళ్లకు చేరినా డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇప్పుడు వీరంతా ఇంటిబాట పట్టనున్నారు.

ట్రాన్స్‌కో కొత్త జేఎండీకి అందని బాధ్యతలు 
ఇటీవల ట్రాన్స్‌కో జేఎండీగా ఐఏఎస్‌ అధికారి సందీప్‌కుమార్‌ ఝాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే సంస్థ సీఎండీ ముర్తుజా రిజ్వీ ఇంకా సందీప్‌కుమార్‌ ఝాకు అధికారికంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆయన విద్యుత్‌ సౌధలోని రెండో అంతస్తులో ఖాళీగా కూర్చుంటున్నారు. గత ప్రభుత్వహయాంలో ట్రాన్స్‌కో జేఎండీగా ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన సి.శ్రీనివాసరావునే ఆ పోస్టులో కొనసాగిస్తున్నారు.

శ్రీనివాసరావు పదవీకాలం వచ్చే ఏప్రిల్‌లో ముగియనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలన్నీ శ్రీనివాసరావుకు తెలిసి ఉండటంతో.. ఆయనను పదవీకాలం ముగిసేవరకు కొనసాగించవచ్చనే అభిప్రాయం ఉంది. తర్వాత కూడా శ్రీనివాసరావును కొనసాగించాలని భావిస్తే.. కొత్త జేఎండీ సందీకుమార్‌ ఝాకు రెండో జేఎండీగా హెచ్‌ఆర్‌ వంటి విభాగాల బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు.

Advertisement
Advertisement