కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దాడులు...

7 Nov, 2020 14:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళితులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ అధ్యక్షతన.. మహిళా కాంగ్రెస్‌ చైర్మన్‌ నేరెళ్ల శారద, ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ప్రీతం అధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. మహాధర్నాలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మహిళా, దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.   (టీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లకే రూ.10 వేలు)

ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 'దళితులకు, మహిళలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణలో కూడా దళితులు, మహిళల హక్కుల కోసం ధర్నా చేయాల్సి రావడం మన దౌర్భాగ్యం. తెలంగాణ కోసం మహిళలు, దళితులు ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోజూ అత్యాచారాలు, దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతిరోజు దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబ పాలన పోవడానికి ప్రతి దళితుడు పోరాటం చేయాలి. ప్రతి మహిళా టీఆర్‌ఎస్‌ను బొంద పెట్టడానికి నడుం బిగించాలి' అని సంపత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. (హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..?)

మరిన్ని వార్తలు