కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం

27 Aug, 2021 03:29 IST|Sakshi

ఆ దిశగా ప్రయత్నిస్తా: ఎంపీ కోమటిరెడ్డి 

తుర్కపల్లి: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ఒప్పించి దళితుడిని లేదా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికేకి ముఖ్యమంత్రి పదవి వచ్చేలా ప్రయత్నం చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే దళితులకు, గిరిజనులకు లబ్ధిచేకూరిందన్నారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్‌ తండాలో గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పాల్గొని మాట్లాడారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గెలవాలని  సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ముందుకు తీసుకువచ్చారన్నారు. సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి దళితులకు ఇప్పటి వరకు ఎందుకు దళిత బంధు డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కలెక్టర్‌ ఖాతాలో డబ్బులుంటే అవి దళితులకు ఏ విధంగా చెందినట్లు అని, అధికారులతో మాట్లాడితే దళితులకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారని అన్నారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గంలోని వాసాలమర్రిలో సభ నిర్వహించి కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని కోమటిరెడ్డి విమర్శించారు. తనను పిలిస్తే దళితబంధుతో పాటు ఇతర కులాలకు కూడా లబ్ధిచేకూరేలా ప్రశ్నిస్తాననే ఉద్దేశంతోనే ప్రొటోకాల్‌ పాటించకుండా సభ నిర్వహించారని చెప్పారు.  

మరిన్ని వార్తలు