లక్షన్నర దాటాయ్‌..! | Sakshi
Sakshi News home page

లక్షన్నర దాటాయ్‌..!

Published Fri, Sep 11 2020 3:00 AM

Coronavirus: 150176 Corona cases  registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గడం లేదు. కేసులు లక్షన్నర దాటాయి. వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం బుధవారం రాత్రి వరకు 19,53, 571 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 1,50,176 మందికి వైరస్‌ సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. అందులో ఇప్పటివరకు 1,17,143 మంది కోలుకోగా, 927 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,106 ఉండగా, అందులో 25,066 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో ప్రతీ 10 లక్షల జనాభాకు 52,619 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. వైరస్‌తో చనిపోయిన కేసుల్లో 46.13 శాతం మంది కరోనాతో చనిపోగా, మిగిలిన 53.87 మంది కరోనాతోపాటు ఇతర వ్యాధులతో చనిపోయినట్లు శ్రీనివాసరావు తెలిపారు. దేశంలో కోలుకున్నవారి రేటు 77.83 శాతం ఉంటే, రాష్ట్రంలో 78 శాతం ఉన్నట్లు వివరించారు. మరణాల రేటు దేశంలో 1.68 శాతం ఉంటే, తెలంగాణలో 0.61 శాతం ఉంది. ఇక ఇప్పటివరకు కరోనా బారినపడిన వారిలో లక్షణాలు లేనివారే 1,03,621 (69%) మంది ఉండగా, లక్షణాలున్నవారు 46,555 (31%) మంది ఉన్నారు. 197 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు అందుబాటులో ఉండగా, ప్రభుత్వంలో 42 ఆసుపత్రుల్లో చికిత్సలు చేస్తున్నారు.

ఒక్కరోజులో 2,534 కేసులు
ఇక బుధవారం 63,017 నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,534 మందికి కరోనా సోకిందని సంచాలకుడు శ్రీనివాసరావు బులెటిన్‌లో వెల్లడిం చారు. అలాగే ఈ ఒక్కరోజులో 2,071 మంది కోలుకోగా, 11 మంది మృతి చెందారు. బుధవారం చేసిన టెస్టుల్లో 28,358 (45%) మంది ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులున్నారు. 8,822 (14%) మంది సెకండరీ కాంటాక్టు వ్యక్తులు ఉన్నారు. మిగిలినవారు డైరెక్ట్‌ కాంటాక్టు వ్యక్తులని శ్రీనివాసరావు తెలిపారు. ఇక తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 327 వచ్చాయి. కేసులు ఎక్కువున్న జిల్లాల విషయానికొస్తే.. రంగారెడ్డిలో 195, నల్లగొండలో 149, మేడ్చల్‌లో 132, వరంగల్‌ అర్బన్‌లో 124, కామారెడ్డిలో 123, ఖమ్మంలో 109, కరీంనగర్‌లో 107, సిద్దిపేటలో 103 కరోనా కేసులు బయటపడ్డాయి.   

Advertisement
Advertisement