దసరా తర్వాతే బస్సులు.. | Sakshi
Sakshi News home page

దసరా తర్వాతే బస్సులు..

Published Sun, Oct 25 2020 1:43 AM

Dasara Being Held For First Time Between Telugu States Without RTC Services - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవకుండా తొలిసారి దసరా జరుగుతోంది. లాక్‌డౌన్‌తో 7 నెలల క్రితం నిలిచిపోయిన బస్సులు.. అంతర్రాష్ట్ర ఒప్పందం లేదన్న కారణంతో ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. దీనిపై 2 నెలలుగా అభిప్రాయ భేదాలు నెలకొన్నా.. దసరా ముంగిట అవి సమసిపోయాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదించిన మేరకు బస్సు సర్వీసులు, తెలంగాణ పరిధిలో తమ బస్సులు తిరిగే కి.మీ. సంఖ్య తగ్గించుకునేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ సమ్మతించింది. అయితే, ఒప్పందానికి సంబంధించిన భేటీ నిర్వహించలేదు. దీంతో తొలిసారి దసరా వేళ ఆర్టీసీ బస్సులు సరిహద్దులు దాటలేదు.

గతేడాది దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ప్రారంభం కావటంతో పండక్కి టీఎస్‌ఆర్టీసీ బస్సులు పెద్దగా నడవలేదు. అదే సమయంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు ముమ్మరంగా నడవడంతో పాటు అదనంగానూ తిరిగాయి. ఇక, ఈ దసరాకు రెండువైపులా బస్సులు సరిహద్దులు దాటలేదు. దీంతో తెలంగాణ పరిధిలో ఉండే ఏపీ ప్రయాణికులు, ఆంధ్రా ప్రాంతంలో ఉండే తెలంగాణవాసులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక, రైళ్లు కూడా పరిమిత సంఖ్యలోనే నడుస్తుండటంతో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల్లో ఊళ్లకు పయనమయ్యారు. 

పండుగ తర్వాతే..
తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదన మేరకు.. తెలంగాణ భూభాగంలో ఏపీ బస్సులు తిరిగే పరిధిని 1.04 లక్షల కి.మీ.మేర తగ్గించుకోవటంతోపాటు, 322 బస్సులు తగ్గించుకునేందుకు ఏపీ సమ్మతించింది. అత్యంత లాభదాయకమైన హైదరాబాద్‌–విజయవాడ మధ్య దాదాపు 51 వేల కి.మీ. మేర తిరిగే నిడివి తగ్గించుకునేందుకూ ఏపీ సిద్ధమైనట్టు తెలిసింది. దీనిపై పండగ తర్వాత మంగళ, బుధవారాల్లో తుది భేటీ జరిగే అవకాశం ఉంది. ఇందులో అవగాహన కుదిరితే రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు మార్గం సుగమమవుతుంది.  

Advertisement
Advertisement