నవంబర్‌ 1 నుంచి డిగ్రీ తరగతులు

23 Sep, 2020 03:10 IST|Sakshi

కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోనూ కసరత్తు

వచ్చే నెలాఖరులోగా ప్రవేశాలు పూర్తి చేసేలా చర్యలు

సాక్షి, హైదరాబాద్‌ : సంప్రదాయ డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్‌ వంటి వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రథమ సంవత్సర మొదటి సెమిస్టర్‌ తరగతులను నవంబర్‌ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోనూ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ తరగతులను అదే రోజు నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ అదే విధానాన్ని అనుసరించేందుకు చర్యలు చేపట్టా లనుకుంటోంది. ఇందులో భాగంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల ప్రవేశాలను వచ్చే నెల 31లోగా పూర్తి చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ఈ నెల 21న డిగ్రీ మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించింది.

రెండు, మూడు దశల కౌన్సెలింగ్‌ను కూడా వచ్చే నెల 10లోగా నిర్వహించి 15వ తేదీలోగా విద్యార్థులంతా కాలేజీల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం... ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్‌ ఎంసెట్‌ను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అవి పూర్తయి, ఫలితాలు ప్రకటించగానే ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి  19 రకాల పీజీ కోర్సులకూ ఈ నెల 21 నుంచి 24 నుంచి ప్రవేశపరీక్షలను నిర్వహిస్తోంది. అవి పూర్తవగానే పీజీ ప్రవేశాలను కూడా వచ్చే నెలలో చేపట్టి పూర్తి చేయనుంది. ఇప్పటికే సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వాటికి సంబంధించిన పరీక్షల నిర్వహణను నవంబర్‌ 9 వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే వాటి ప్రవేశాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇంజనీరింగ్‌ పీజీ ప్రవేశాలు మాత్రం పూర్తి కానున్నాయి. యూజీసీ షెడ్యూల్‌ ప్రకారమే రాష్ట్రంలోనూ అకడమిక్‌ కేలండర్‌ను అమలు చేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

3లోగా ఎంసెట్‌ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చే నెల 3వ తేదీలోగా విడుదల కానున్నాయి. అందుకు అనుగుణంగా ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభిం చింది. వీలైతే ఈ నెల 30న ఫలితాలను విడుదల చేసే అవకాశాలనూ కమిటీ పరిశీలిస్తోంది. ఒకవేళ కుదరకపోతే వచ్చే నెల 1న లేదా 3న విడుదల చేయనుంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే అగ్రికల్చర్‌ ఎంసెట్‌ పరీక్షల ఫలితాలను కూడా వచ్చే నెల మొదటి వారంలోనే ప్రకటించేలా ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది.  

మరిన్ని వార్తలు