ఓటరు జాబితా ‘ప్రక్షాళన’  | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా ‘ప్రక్షాళన’ 

Published Sat, Aug 26 2023 1:34 AM

Deletion of large number of votes registered with same house number - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ కోసం ఎన్నికల సంఘం పకడ్బంధీ చర్యలు చేపట్టింది. సమగ్ర ఇంటింటి సర్వే ద్వారా పలు రకాల తప్పులను గుర్తించి ఓటరు జాబితా రూపకల్పనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఒకే ఇంటి నెంబర్‌తో భారీ సంఖ్యలో ఓట్లు నమోదైన విషయాన్ని పలు రాజకీయ పా ర్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకురావడంతో పాటు ఓటరు జాబితా తయారీలో తప్పులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ఆధారంగా ఈ సర్వే చేపట్టినట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్‌ వర్గాలు వెల్లడించారు.

కమిషన్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈఆర్‌వో.నెట్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఓటరు డేటాను పరిగణనలోకి తీసుకుని ఇంటింటి సర్వే నిర్వహించడం ద్వారా సూక్ష్మ పరిశీలన జరిపారు. ఈ విధంగా జరిపిన పరిశీలనలో రాష్ట్రంలోని మొత్తం 7,66,557 ఆవాసాల్లో ఉన్న 75,97,433 ఓట్ల సవరణ జరిగింది. హైదరాబాద్‌ నగరంలోని కార్వాన్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 17,398 ఆవాసాల్లోని 2,20,316 మంది ఓటర్లు, యాకుత్‌పురా పరిధిలోని 14,883 ఆవాసాల్లో ఉన్న 1,84,060 ఓటర్లు, రాజేంద్రనగర్‌లోని 13,901 ఆవాసాలకు చెందిన 1,57,972 ఓటర్లు, ఎల్బీనగర్‌ పరిధిలోని 13,987 ఆవాసాల్లో ఉన్న 1,48,378 ఓటర్లు, మల్కాజిగిరి నియోజకవర్గంలోని 10,649 ఆవాసాల్లోని 1,06,336 మంది ఓటర్లను గుర్తించి సవరణలు చేశారు.

దీంతో పాటు ఓటర్‌ కార్డులోని చిరునామాతో పాటు ఇతర మార్పులు, ఓటరు కార్డుల మార్పు కోసం ఫారం–8 ద్వారా వచ్చిన దాదాపు 9,00,115 దరఖాస్తులను ఎన్నికల కమిషన్‌ పరిష్కరించింది. ఇందులో అత్యధికంగా ఆసిఫాబాద్‌ నుంచి 25,026 దరఖాస్తులు రాగా గద్వాల, హుస్నాబాద్, ఖానాపూర్, మక్తల్‌ల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే అత్యధికంగా సిద్దిపేటలో 18,148, శేరిలింగంపల్లిలో 17,312, మేడ్చల్‌లో 16,569 దరఖాస్తులు రాగా, వాటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం పరిష్కరించినట్లు ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలి 
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చనిపోయిన, ఇతర ప్రాంతాలకు తరలిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌కు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గాల్లో ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లను ఒకే పోలింగ్‌ బూత్‌లోకి మార్చాలని కోరారు.

ఈ మేరకు శుక్రవారం బీజేపీ జాతీయ ఈసీ కమిటీ సభ్యుడు ఓం పాఠక్, రాష్ట్రపార్టీ ఈసీ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు ఏడెల్లి అజయ్‌ కుమార్, పొన్న వెంకటరమణ, కేతినేని సరళ, కొల్లూరి పవన్‌ కుమార్‌ వినతిపత్రం సమర్పించారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను తప్పుల తడకగా తయారుచేసిన ఈఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఈవోకు మరో వినతిపత్రం అందజేశారు.  

Advertisement
Advertisement