న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే!

30 Dec, 2023 03:52 IST|Sakshi

కానిస్టేబుల్‌ విద్యార్ధుల పోరాట సమితి ఆవేదన

పోలీస్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌

‘ప్రజావాణి’లో అర్జీలను ఇచ్చి ఆందోళన

లక్డీకాపూల్‌: వేలాది మంది అభ్యర్ధులకు అన్యాయం జరిగి, వారిలో కొందరి చావుకి కారణమైన పోలీస్‌ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో మూకుమ్మడి ఆత్మహత్యలే తమకు శరణ్యమని పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లోని ‘ప్రజావాణి’లో నష్టపోయిన ఎస్‌.ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్ధులు అర్జీలను సమర్పించారు.

ఈ సందర్భంగా పోరాట సమితి ప్రతినిధి ఆకాష్‌ మాట్లాడుతూ..  తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలను ఇవ్వాలని, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు.  యాసం ప్రదీప్‌ మాట్లాడుతూ పోలీస్‌ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేసి.. ప్రిలిమ్స్‌ నుంచి మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో అదనంగా 2 సంవత్సరాల వయోపరిమితిని పెంచి ఇప్పటివరకు మిగిలి ఉన్న పోస్టులన్నీ కలిపి ఒక మెగా రిక్రూట్‌మెంట్‌ని విడుదల చేయాలని కోరారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తిరిగిపాలిటెక్నిక్‌ కాలేజీలకే బదిలీ చేయాలి
రేషనలైజేషన్‌ చేసి దూర ప్రాంతాలకు బదలీ చేసిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను య«థావిధిగా పాత పాలిటెక్నికల్‌ కళాశాలలకే బదిలి చేయాలని తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నికల్‌ అండ్‌ కమిషనరేట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మారెపల్లి సుధాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెం.317తో స్ధానికతను కోల్పోయి నష్టపోయిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని స్ధానికత సాధన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. శ్రీనివాసరావు, కె. శ్రీశైలం డిమాండ్‌ చేశారు. 

మల్లారెడ్డి నుంచి మా భూములు మాకిప్పించండి..
సూరారంలోని రూ.190 కోట్ల విలువైన సర్వే నెం.95, 96, 97, 98లకు చెందిన 9.1 గుంట పట్టా భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని.. అదేమంటే తమపై పోలీసు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కుద్బుల్లాపూర్‌కి చెందిన నర్సిమ్మ తనయుడు కృష్ణ ఆవేదన చెందారు. సర్వే నెం.107లోని ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసి తమ బినామీలు మహేంద్రరెడ్డి, సుధీర్‌రెడ్డి, ప్రవీణ్‌ కుమార్, చెన్నారెడ్డిల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంతన్న న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పేద సినీ కళాకారులను పట్టించుకోవాలి
తెలంగాణ సినీ కార్మికుల కష్టాలను ఆలకించి.. పేద కళాకారులను పట్టించుకోవాలని నటుడు నాని వెంకట్‌ జైరాజ్‌ కోరారు. ధరణి తప్పిదాల వల్ల తమ ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నానని రంగారెడ్డి జిల్లాకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. ముౖఫై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ పట్టా భూమికి అధికారులు సర్వే సర్టిఫైడ్‌ కాపీ ఇవ్వడం లేదని ములుగు జిల్లా నల్లగుంటకు చెందిన పబ్బ వెంకటరమణయ్య వాపోయారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: 
ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నోడల్‌ అధికారి హరిచందన తెలిపారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుని, దరఖాస్తులు స్వీకరించారు. 12 కౌంటర్ల ద్వారా 24 మంది అధికారులు అర్జీదారుల నుండి 2,445 దరఖాస్తులు స్వీకరించారు.

>
మరిన్ని వార్తలు